ఇరాన్‌పై ట్రంప్ దూకుడు... మరో భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో ప్రపంచం వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితం వెనిజులా అధ్యక్షుడు, అతని భార్యను అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి న్యూయార్క్ తరలించి ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేశారు ట్రంప్. అక్కడితో ఆగకుండా తానే వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించారు. అమెరికా భద్రత, డ్రగ్స్ నిర్మూలన‌కే ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ చెబుతున్నప్పటికీ.. వెనిజులాలోని చమురు, పెట్రోల్ వనరులపై ఆధిపత్యం కోసమే అగ్రరాజ్యం ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను

వెనిజులాపై సైనిక చర్యను మరిచిపోకముందే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలని.. ఇందుకు నాటో దేశాలు చొరవ చూపాలని లేదంటే రష్యా, చైనాలు దానిని ఆక్రమించుకుంటాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే తోటి నాటో దేశం ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యను ఆ కూటమిలోని దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ముదురుతున్న దశలోనే ఇరాన్‌లో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడం, నిరసనలను అణిచివేసేందుకు ఇరాన్ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు.

ఇరాన్ నిరసనలకు ట్రంప్ మద్ధతు

ఇరాన్‌లో నిరసనకారులకు ఆయన బహిరంగంగా మద్ధతు పలకడంతో పాటు నిరసనలను ఖండించారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని.. నిరసనలు ఆపొద్దని సోషలో మీడియాలో పేర్కొన్నారు. ఆందోళనలను అణిచివేసే క్రమంలో మానవత్వంతో వ్యవహరించాలని లేనిపక్షంలో ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అయితే అగ్రరాజ్యాధినేత ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులకు మరణశిక్ష సహా కఠినమైన శిక్షలను విధించాలని అక్కడి ప్రభుత్వం పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఏ క్షణామైనా ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు ఉండటంతో గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యకు ట్రంప్ నిర్ణయించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి తగినట్లుగానే అగ్రరాజ్యం.. తనకు గల్ఫ్, పశ్చిమాసియా దేశాలలో ఉన్న సైనిక స్థావరాలను అప్రమత్తం చేయడంతో పాటు ఆయుధ సంపత్తిని భారీగా మొహరిస్తోంది. అలాగే అమెరికాకు దాని మిత్రపక్షాల నుంచి కూడా సంపూర్ణ సహకారం లభిస్తోంది. అటు ఇజ్రాయెల్ కూడా మరోవైపు నుంచి ఇరాన్‌ను కమ్మేయడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇరాన్‌లో రాగల 24 గంటల్లో ఏం జరుగుతుందోనని అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు అలర్ట్

ఇరాన్‌లో పరిస్ధితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. తమ పౌరులు తక్షణం ఇరాన్ విడిచి వచ్చేయడంతో పాటు ఆ దేశానికి విమాన సర్వీసులను సైతం నిలిపివేశాయి. అటు భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే పలుమార్లు అడ్వైజరీలను జారీ చేయగా.. తాజాగా పలు మార్గాల్లో భారతీయులు ఇరాన్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. అలాగే ఇరాన్ నుంచి భారతీయులను క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇరాన్‌లో 10 వేలమంది భారతీయులు

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా. ఇంటర్నెట్ సేవలు, రవాణా సేవలు స్తంభించిపోవడంతో వీరి తరలింపులో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అన్ని రకాల మార్గాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలించేలా కేంద్రం కట్టుదిట్టమైనప ఏర్పాట్లు చేస్తోంది. అయితే భారతదేశానికి ఇలాంటి ఆపరేషన్లు వెన్నతో పెట్టిన విద్య. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం కొత్త కూడా కాదు.. కరోనా, లాక్‌డౌన్ సమయంలో వందే భారత్ మిషన్ ద్వారా ప్రపంచం మునుపెన్నడూ చూడని తరలింపు ప్రక్రియ చేపట్టింది ఇండియా.  వివిధ దేశాలలో చిక్కుకుపోయిన దాదాపు 1.83 కోట్ల మంది భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చి చరిత్ర సృష్టించింది.

భారీ ఆపరేషన్‌కు ఇండియా రెడీ?

2022లో రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి గాను భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి రొమానియా, హంగరీ, పోలాండ్, స్లోవాకియా దేశాల మీదుగా 22500 మంది భారతీయులను స్వదేశానికి తరలించింది ఇండియా. ఇక గతేడాది ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధు చేపట్టిన భారతదేశం.. ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఉన్న దాదాపు 4,429 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించింది. ఇప్పుడు ఇరాన్‌లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో మరోసారి భారతదేశం భారీ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే భారత విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే.

Comments