వినాయక చవితి.. వాడవాడలా విభిన్న రూపాల్లో దర్శనిస్తున్న గణపతి
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం వినాయక చవితిని జరుపుకోగా, మంగళవారం కూడా చవితి వుండటంతో మరికొన్ని చోట్ల ఈరోజు గణపయ్యను పూజించారు. వూరూ వాడా విఘ్నేశ్వరుడికి మంటపాలు ఏర్పాటు చేసిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకోనున్నాడు గణపయ్య.కాణిపాకం, విశాఖ, పుణే, ముంబైలలోని ప్రఖ్యాత గణపతి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇక గణేశ్ నవరాత్రులకు దేశంలోనే ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో పండుగ శోభ కనిపిస్తోంది. నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేషుడు ఈసారి దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 63 అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని నిర్వహకులు తయారు చేశారు. ఫ్రేమ్ కోసం 22 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఏలూరు నుంచి 40 కిలోల జ్యూట్ పౌడర్, యాదాద్రి నుంచి వరిపొట్టు, రాజస్థాన్ నుంచి 40 వేల కిలోల మట్టిని తీసుకొచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ నిర్వహించారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8 వరకు వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Post a Comment