కొడంగల్ ‘‘చేతి’’లో పడాల్సిందే.. రేవంత్ స్ట్రాటజీ ఏంటీ..?

 



Telangana Congress : 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. చేద్దాంలే.. చూద్దాంలే అనుకున్న వారంతా అటెన్షన్ అయ్యారు. గత రెండు ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి తెలంగాణలో కొంత మెరుగ్గా కనిపిస్తోంది. పొరుగున వున్న కర్ణాటకలో విజయం సాధించడంతో పాటు హైకమాండ్ నేరుగా పర్యవేక్షించడం, ఈసారి గెలవకుంటే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమని నేతలు భావించారు. ఈ భయమే ఎన్ని గొడవలున్నా వాటిని పక్కనబెట్టి ఐక్యంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వంపై వున్న అసంతృప్తి, రేవంత్ రెడ్డి ఛరిష్మా, గ్యారెంటీ స్కీములు, కేడర్ దూకుడుతో ఈసారి తమకు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

లోక్‌సభ వద్దు.. అసెంబ్లీ ముద్దు :

తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేతలు ఈసారి అసెంబ్లీ బరిలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ , ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్‌నగర్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండల నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు ఒకప్పటి కంచుకోట కొడంగల్ నుంచి బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు రాజకీయ జన్మనిచ్చిన ఈ ప్రాంతమంటే రేవంత్ రెడ్డికి అభిమానం. మల్కాజిగిరి ఎంపీగా వుంటున్నా మనసంతా కొడంగల్ మీదే వుందన్నది కాదనలేని వాస్తవం. 

కొడంగల్ నుంచే రేవంత్ రాజకీయ ప్రస్థానం :

ఉమ్మడి రాష్ట్రంలో 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే 2018లో బీఆర్ఎస్ అధిష్టానం ఈ సీటుపై ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్‌రావు చక్రం తిప్పారు. దీంతో ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. అనూహ్య ఓటమితో రేవంత్ రెడ్డి సైతం ఖంగుతిన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునే పనిలో పడ్డారు. షాక్ నుంచి తేరుకుని నెలల గ్యాప్‌లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. తన వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, ఆర్ధిక , అంగ బలాలతో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి హైకమాండ్‌ దృష్టిలో పడ్డారు. 

తెలంగాణలో ఎదుగుతూ కొడంగల్‌‌ని వదలని రేవంత్ :

2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో వున్నోళ్లను కూడా పక్కనబెట్టి రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ పెద్దలు సైతం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్లారు. పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ బలపడేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆనాడే డిసైడ్ అయిన రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్‌‌కు చెక్ పెడుతూ వచ్చారు. స్థానికంగా అధికార పార్టీకి చెందిన కీలక నేతలను కాంగ్రెస్‌లోకి రప్పించే పనికి శ్రీకారం చుట్టారు. 

చండీయాగం నిర్వహించిన రేవంత్ :

ఈసారి తాను కొడంగల్ బరిలో వున్నట్లుగా తేటతెల్లం చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ బాటలోనే చండీయాగం జరిపించారు. కొడంగల్‌లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన శక్తి యుక్తులతో పాటు దైవబలం తోడుగా కేసీఆర్ వ్యూహాలను చిత్తు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అలాగే దాదాపు పదేళ్లుగా అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్‌కు మళ్లీ ‘‘పవర్’’ రుచి చూపించాలని యత్నిస్తున్నారు. మరి రేవంత్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలీకృతమవుతాయో డిసెంబర్ 3న తేలిపోనుంది. 


Comments