గన్‌మెన్‌లు నాకొద్దు : మళ్లీ అలిగిన బాలినేని .. పోలీసులు ఆయన్ను పట్టించుకోవడం లేదట
Balineni Srinivasa Reddy :
మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వై నాట్ 175 అంటూ జగన్ తన శ్రేణులకు టార్గెట్ ఇచ్చి.. ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ నేతలు నిత్యం జనంలో వుండేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే తాను కూడా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టి.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎంత బిజీగా వున్నప్పటికీ చెప్పిన రోజు .. చెప్పిన టైంకి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇదంతా ఓవైపే.. నాణేనికి మరోవైపు చూస్తే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నేతల మధ్య సఖ్యత లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట నేతలు గొడవలకు దిగుతున్నారు. వీరిలో కొందరికి హైకమాండ్ చెప్పిచూసినా లాభం లేకపోవడంతో వాళ్లను వదిలేసింది. ఇంకొన్ని చోట్ల నేతలే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అలుగుతున్నారు.
కేబినెట్ విస్తరణ తర్వాతి నుంచి అంటీముట్టనట్లుగానే :
వైసీపీ సీనియర్ నేత, జగన్ దగ్గరి బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని కోల్పోయిన బాలినేని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయనను బుజ్జగించేందుకు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు స్వయంగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ కోసం తప్పనిసరి పరిస్ధితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, సహకరించాలని, ఈసారి మన ప్రభుత్వం రాగానే ప్రాధాన్యత కల్పిస్తామని జగన్ స్వయంగా హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటికి సైలెంట్ అయినా కానీ మధ్య మధ్యలో ఆయన షాకులు ఇస్తూనే వున్నారు శ్రీనివాస్ రెడ్డి. తనకు అప్పగించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఒకానొక దశలో బాలినేని ..పార్టీని వీడబోతున్నారంటూ కథనాలు వచ్చాయి.
సీఎం హెలిప్యాడ్ వద్ద బాలినేనిని అడ్డుకున్న పోలీసులు :
మొన్నామధ్య ప్రోటోకాల్ విషయంలో తనకు అవమానం జరిగిందంటూ అలిగారు బాలినేని.. అది కూడా సీఎం స్వయంగా పాల్గొంటున్న సభా స్థలి వద్ద. తన జిల్లాకు వస్తున్న జగన్‌కు స్వాగతం పలికేందుకు బాలినేని వెళ్తుండగా .. హెలిప్యాడ్ వద్ద ఆయన వాహనాలను సీఎం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు . మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పీ ఇతర అధికారులు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. ఈ విషయం సీఎంవో ద్వారా తెలుసుకున్న జగన్.. మార్కాపురంలో ఈబీసీ నేస్తం నిధుల విధుల కార్యక్రమాన్ని శ్రీనివాస్ రెడ్డి చేతే బటన్ నొక్కించారు.
ప్రకాశం జిల్లాలో కాకరేపుతోన్న నకిలీ దస్తావేజుల కేసు :
జగన్ జోక్యంతో ఆ వివాదం సద్దుమణగగా.. జిల్లాకు సంబంధించిన నేతలపై శ్రీనివాస్ రెడ్డి అప్పుడప్పుడు విరుచుకుపడేవారు. తనకు వ్యతిరేకంగా కొందరు సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారంటూ సీఎంకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఏకంగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. దీనికి కారణంగా ‘‘నకిలీ భూ దస్తావేజుల కేసు’’. ఈ వ్యవహారంలో పోలీసుల తీరును బాలినేని తప్పుబడుతున్నారు. నకిలీ భూ పత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలపెట్టవద్దని, తన పక్కనున్న వారినైనా వదలొద్దని కలెక్టర్‌కు తెగేసి చెప్పారు శ్రీనివాస్ రెడ్డి.
పోలీసుల తీరుపై బాలినేని అలక :
అయినప్పటికీ అసలు దోషులను వదిలేసి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలినేని మండిపడుతున్నారు. పోలీసులు తన సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నాలుగేళ్లుగా ఇదే వైఖరితో వుంటున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటితో అలిగిన ఆయన పోలీసుల తీరును తప్పుబడుతూ తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మరి ఈ వివాదాన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారో.. బాలినేనిని ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.

Comments
Post a Comment