జగన్ దగ్గర పావలా దమ్ములేదు .. కేసులకు భయపడను, వైఎస్‌తోనే పెట్టుకున్నా : పవన్ కల్యాణ్
Pawan Kalyan Speech at varahi vijaya yatra, Pedana :
నాలుగో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు. స్థానిక తోటమూల సెంటర్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వాడి వేడి విమర్శలు చేశారు. జగనన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదని.. రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పథకాల నిధుల మళ్లింపులో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని కేంద్ర నివేదికలు చెబుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఉదాహరణకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన రూ.337 కోట్ల నిధుల్లో కేవలం రూ.6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని జగన్ దారి మళ్లించారని జనసేనాని ఆరోపించారు.
ఏపీకి రావాలంటే వీసా కావాలేమో :
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని.. చివరికి రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నా వీసా తీసుకుని రావాలి అన్నట్లుగా పరిస్ధితులు వున్నాయని జనసేనాని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన రోజున తనను ఏపీ బోర్డర్‌లో అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో వుండి, ప్రధాన మంత్రితో పరిచయం వున్న తనకే ఈ పరిస్ధితి ఎదురైతే సాధారణ ప్రజల పరిస్ధితి ఏంటని పవన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణపై దాడి జరిగిందని.. ఇది తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
జగన్ దగ్గర పావలా దమ్ము లేదు :
ప్రధానిని కలిసినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌కు విభజన వల్ల అన్యాయం జరిగిందని.. అండగా వుండాలని కోరేవాడినని పవన్ చెప్పారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ అవినీతికి పాల్పడుతున్నారని.. ఇక్కడ ప్రతి పనికి ఆయనకు ట్యాక్స్ కట్టాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పాస్‌బుక్ కావాలంటే రూ.10 వేలు కట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అక్రమాలను అడ్డుకుంటే అక్రమ కేసులు, ఏకంగా హత్యాయత్నం కేసులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గర పావలా దమ్ము లేదని.. కనీసం పార్లమెంట్‌లో గళమెత్తడానికి భయపడి సోనియా గాంధీకి కనిపించకుండా ఓ మూలకి వెళ్లి ప్లకార్డ్ పట్టుకున్నారని పవన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కేంద్రం వద్దకు వెళ్లి కేసులు లేకుండా చేయాలని పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని జనసేనాని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే గొడవ పెట్టుకున్నా :
2009 సమయంలో తాను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి జగన్ కనీసం ఎంపీ కూడా కాదన్నారు. వైఎస్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను తనపై అటాక్ జరిగిందని..ఆఫీసు మీదకు మనుషులొస్తే సెక్యూరిటీ సిబ్బంది సైతం పారిపోయారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గుండెనిండా ధైర్యంతో చేతిలో ఆయుధం లేకున్నా తాను నిలబడ్డానని పవన్ గుర్తుచేశారు. వాలంటీర్లపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని.. తనపై ఏ కేసు పెట్టుకున్నా పర్లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Post a Comment