ఓ పక్క దూకుడుగా జగన్.. టీడీపీ-జనసేన అభ్యర్ధుల ప్రకటన ఎప్పుడు..?
ChandraBabu Naidu - Pawan Kalyan :
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు నిధుల సమీకరణ, అభ్యర్ధుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై తలమునకలై వున్నాయి. వైసీపీ చీఫ్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో మిగిలిన అన్ని పార్టీల కంటే ముందున్నారు. తన వద్ద వున్న సమాచారం, సర్వేలు, ఇతర డేటా ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు జగన్. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వున్న వారి విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పక్కనపెట్టేస్తున్నారు .
ఈ లిస్ట్‌లో తన ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు వున్నా సరే.. రెండోసారి అధికారాన్ని అందుకునే విషయంలో చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకూడదని జగన్ డిసైడ్ అయ్యారు. సొంత పార్టీ , విపక్ష నేతల ఊహాకు కూడా అందని విధంగా అభ్యర్ధుల ఎంపిక చేస్తున్నారు సీఎం.
జగన్ అంత దూకుడు మీదుంటే ఇటుపక్క టీడీపీ జనసేన కూటమిలో మాత్రం అంత స్పీడ్ కనిపించడం లేదు. సీట్ల పంపకంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పటికే పలుమార్లు మంతనాలు జరిపారు. బీజేపీని కూడా కూటమిలోకి లాగేందుకు ఇద్దరూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చే విషయంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు, నారా లోకేష్‌లు హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరికి వచ్చారు. వచ్చే వారం నాటికి పంపకాలు ఖరారు చేసి.. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం తొలి జాబితాను ప్రకటించే అవకాశం వుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటికి అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేయాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. సీట్ల పంపకంతో పాటు బీజేపీతో పొత్తుపైనా స్పష్టత తీసుకొచ్చేందుకు ఇరుపార్టీల అధినేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Comments
Post a Comment