బోండా ఉమాకు విజయవాడ సెంట్రల్ కన్ఫర్మ్.. మరి వంగవీటి రాధాకి సీటెక్కడ..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు శనివారం విడుదల చేశారు. పొత్తు ఖరారైన నాటి నుంచి సీట్ల పంపకంపై పలు విడతలుగా ఇద్దరు నేతలు మంతనాలు జరుపుతూ వచ్చారు.
అభ్యర్ధుల ప్రకటనపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కీలక ప్రకటన వెలువడింది. అధినేతల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఇవి తలనొప్పులుగా మారకుండా బుజ్జగింపులు కూడా మొదలయ్యాయి.
రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ వంటి విజయవాడలో అక్కడి సెంట్రల్ నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కింది. ఈ సెగ్మెంట్ అన్ని పార్టీలకు హాట్ కేకే. తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావుకు కేటాయించింది. ఇదే స్థానంపై దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు రాధాకృష్ణ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సెంట్రల్ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని ఆయన కృతనిశ్చయంతో వున్నారు. అసలు 2019 ఎన్నికలకు ముందు రాధా వైసీపీని వీడింది కూడా సెంట్రల్ నియోజకవర్గం కోసమేనని బెజవాడ జనాలు చెప్పుకుంటూ వుంటారు. కానీ అప్పటికే అభ్యర్ధుల ప్రకటన జరిగిపోవడంతో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు రాధాబాబు.
ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టాలని రంగా వారసుడు భావిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సెంట్రల్ స్థానాన్ని బోండా ఉమాకే కేటాయించడంతో రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది చర్చనీయాంశమైంది.
సెంట్రల్ నుంచి బోండా ఉమా అభ్యర్ధిత్వం ఖరారు చేయడంపై చంద్రబాబు నుంచి ముందే రాధాకి సమాచారం అందిందా లేక ఆయనకు చెప్పకుండానే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందా అన్నది తెలియాల్సి వుంది. అభ్యర్ధుల ప్రకటన తర్వాత రాధా బ్యాచ్ ఎలాంటి చడీ చప్పుడు చేయకపోవడం కూడా దీనికి బలం చేకూర్చినట్లయ్యింది.
కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువగా వున్న నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి రాధాను బరిలో దించే ఆలోచనలో చంద్రబాబు వున్నట్లుగా తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. మరి ఈ ప్రతిపాదనకు వంగవీటి రాధా ఓకే చెబుతారా అన్నది వేచి చూడాల్సి వుంది.
Comments
Post a Comment