ఎన్నికల వేళ.. జగన్‌కు మరో షాక్.. వైసీపీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై



Magunta Sreenivasulu Reddy : 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీలో అసమ్మతిని రాజేసింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన.. ప్రజా వ్యతిరేకత వున్న వారిని పక్కనపెట్టేస్తున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారికి జగన్ నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తున్న వారు సైతం ఆయనను వదిలేస్తున్నారు. 

ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు అధికార పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. 

ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఓ బ్రాండ్ అన్న ఆయన.. 33 ఏళ్లుగా రాజకీయాల్లో వున్నానని, 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని శ్రీనివాసులు రెడ్డి గుర్తుచేశారు. కొన్ని అనివార్య పరిస్ధితుల్లో వైసీపీని వీడుతున్నామని.. బాధాకరమే అయినా తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వుంటారని శ్రీనివాసులు రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. 

ఒంగోలు పార్లమెంట్ టికెట్‌ను ఈసారి మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇచ్చేది లేదని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. ఆయన కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చివరి వరకు పోరాడారు. మాగుంటతో కలిసే ఈసారి ఎన్నికలు ఎదుర్కొంటానని ఏకంగా జగన్‌పైనే అలకబూనారు. తన మాటకు విలువ లేకపోవడంతో బాలినేని హైదరాబాద్‌లోనే వుంటున్నారు. ఆయనను బుజ్జగించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర పార్టీ పెద్దలు ఎంతగా ప్రయత్నిస్తున్నా మెత్తబడటం లేదు. బాలినేని కానీ తాను కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ నుంచి టికెట్‌పై స్పష్టత రాకపోవడంతో వైసీపీని వీడాలని మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫిక్స్ అయ్యారు. 

వాస్తవానికి మాగుంట కుటుంబానిది నెల్లూరు జిల్లా. కానీ ఈ ఫ్యామిలీ తమ రాజకీయ కేంద్రంగా ప్రకాశం జిల్లాను మార్చుకుంది. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో 1995 డిసెంబర్‌లో నక్సల్స్ కాల్పుల్లో మాగుంట ప్రాణాలు కోల్పోయారు. అనంతరం 1996 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ టీడీపీ అభ్యర్ధి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై విజయం సాధించారు. 1998లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ టికెట్‌పై ఒంగోలు నుంచి పోటీ చేసి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే 1999లో టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం చేతిలో శ్రీనివాసులు రెడ్డి ఓటమి పాలయ్యారు. 

తిరిగి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్ధి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయన విజయం సాధించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన మాగుంట కుటుంబానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం వుంది. అలాంటి నేత వైసీపీని వీడటం జగన్‌కు షాకేనని చెప్పాలి. 

Comments