అధీర్ రంజన్ కంచుకోటపై తృణమూల్ కాంగ్రెస్ గురి.. టీఎంసీ అభ్యర్ధిగా యూసుఫ్ పఠాన్

 



సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ వుండటంతో అన్ని పార్టీలు నిధుల సమీకరణ, అభ్యర్ధుల ఎంపిక, వ్యూహ ప్రతి వ్యూహాలతో తలమునకలై వున్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే కొందరి పేర్లతో జాబితాను కూడా విడుదల చేశాయి. ఎన్నికల వేళ సెలబ్రెటీలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం పండిట్ నెహ్రూ హయాం నుంచి వస్తున్నదే. ఈసారి కూడా పలు పార్టీల నుంచి పలువురు ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కొన్ని పార్టీలు వాటికవే సెలబ్రెటీలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానాలు పలుకుతున్నాయి. 

టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ .. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరడం క్రీడా, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ స్థానం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పఠాన్ పోటీ చేయనున్నారు. టీఎంఎసీ నేత అభిషేక్ బెనర్జీ ఈ మేరకు పఠాన్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. 

1999 నుంచి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కంచుకోటగా కొనసాగుతున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఎంసీ వ్యూహాలు రచిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ సీటులో ఎన్నడూ గెలిచింది లేదు. ఇప్పుడు దానిని స్టార్ పవర్‌తో కైవసం చేసుకోవాలని దీదీ పావులు కదుపుతున్నారు. పార్లమెంట్ దిగువసభలో మూడవ అత్యధిక ఎంపీలను కలిగివున్న బెంగాల్‌లో బీజేపీకి చెక్ పెట్టడానికి టీఎంసీ తన అభ్యర్ధులను ఆచితూచి ఎంపిక చేస్తోంది. 

టీఎంసీ వర్గాల ప్రకారం.. 52 శాతం మంది మైనారిటీ ఓటర్లు వున్న బెర్హంపూర్‌లో మైనారిటీ ఫేస్ కోసం ఆ పార్టీ జల్లెడ పట్టింది. దీనిలో భాగంగా యూసుఫ్ పఠాన్‌కు ఆఫర్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో భాగంగా బెంగాల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్) తరపున యూసుఫ్ పఠాన్ ప్రాతినిథ్యం వహించాడు. టీఎంసీ తమ వాయిస్‌గా నాకు ఆఫర్ ఇచ్చిందని.. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పఠాన్ మీడియాతో అన్నారు.

లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన 42 మంది అభ్యర్ధుల జాబితాలో పఠాన్ గుజరాత్‌కు చెందినవారు. బహిరంగ ర్యాలీలో యూసుఫ్ పఠాన్ పేరును ప్రకటించగానే తృణమూల్ మద్ధతుదారులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తర్వాత 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడవ క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 

యూసుఫ్ పఠాన్ అతని తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌ ఇద్దరూ టీమిండియా తరపున ప్రాతినిథ్యం వహించారు. బరోడాకు చెందిన యూసుఫ్ భారత్ తరపున 57 వన్డేలు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్ జట్టులో , 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో పఠాన్ సభ్యుడు. 2012, 2014లలో ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన కోల్‌కతా జట్టులోనూ పఠాన్ భాగం. యూసుఫ్, ఇర్ఫాన్‌ ఇద్దరూ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడారు. 

మరో మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌ను కూడా బుర్ద్వాన్ దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ రంగంలోకి దించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పలుమార్లు వేదిక పంచుకున్న కీర్తి ఆజాద్.. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని మీడియాలో ఇప్పటికే ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ ఆయన అభ్యర్ధిత్వాన్ని టీఎంసీ ఖరారు చేసింది. 2021 నవంబర్‌లో కీర్తి ఆజాద్ అధికారికంగా తృణమూల్‌లో చేరారు. 


Comments