ఎన్నాళ్లకెన్నాళ్లకు .. ఢిల్లీలో మంచి గాలి వీచిందోచ్

 



ఢిల్లీలో గాలి స్వచ్ఛత ఎలా వుంటుంది అంటే చిన్న పిల్లోడిని అడిగినా అబ్బో దాని గురించి ఎందుకులే అని ఆన్సర్ ఇస్తాడు. ఏడాది మొత్తం ఎలాగోలా నెట్టుకొచ్చినా.. శీతాకాలంలో మాత్రం ఢిల్లీ వాసులు నరకం చూస్తుంటారు. దేశ రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైతులు తమ పంట వ్యర్ధాలను కాల్చివేయడంతో పాటు పొగమంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా మారుతుంది. 

ఈ పరిస్ధితిని చక్కదిద్దేందుకు సరిబేసి విధానంలో వాహనాలు రోడ్డెక్కేలా చర్యలు తీసుకున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కులు, నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల రాకపోకలను సైతం నిషేధించారు. 

అలాగే 12 ఫైరింజన్ల ద్వారా గాలి నాణ్యత బాగా పడిపోయిన ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి అక్కడ నీటిని జల్లులుగా పిచికారీ చేసే పనులు సైతం చేపట్టారు. అయినప్పటికీ పరిస్ధితిలో మాత్రం మార్పు వచ్చేది కాదు. 

ప్రభుత్వ కొలమానం ప్రకారం గాలి నాణ్యతకు సంబంధించి పలు స్థాయిలు వున్నాయి. 0-50 (మంచిది), 51-100 (సంతృప్తికరం), 101-200 (మోస్తరు), 201-300 (నాసిరకం), 301-400 (చాలా నాసిరకం), 401-450 (తీవ్రం), 450 పైనే వుంటే అతి తీవ్రంగా పరిగణిస్తారు. ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో గాలి నాణ్యత 461గా రికార్డయ్యిందంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ప్రభుత్వం భావించింది. 

అలాంటిది దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 9 ఏళ్ల తర్వాత గాలి కాలుష్యం తగ్గుముఖం పట్టి కాస్తంత మెరుగైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. రాజధాని పరిధిలో చిన్నపాటి వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  దీని పర్యవసానంగా గడిచిన 9 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గాలి క్వాలిటీ కాస్త మెరుగుపడింది. 

ఫిబ్రవరిలో గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2013 తర్వాత ఇదే అత్యధికమని వెల్లడించారు. మొత్తం మీద 9 ఏళ్ల తర్వాత స్వచ్ఛతతో కూడిన గాలి అందుబాటులోకి రావడంతో రాజధాని వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Comments