సుధామూర్తికి రాజ్యసభ.. మానవత్వానికి పర్యాయ పదంగా నిలిచిన ‘‘ మిసెస్ మూర్తి ’’
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి, ప్రముఖ సామాజికవేత్త సుధామూర్తిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ట్వీట్ చేశారు. విద్య, మహిళా హక్కులు, సామాజిక సేవ తదితర అంశాల్లో సుధామూర్తి చెరగని ముద్ర వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని మోడీ పేర్కొన్నారు. అలాంటి మహిళ రాజ్యసభలో వుండటం నారీశక్తికి నిదర్శనమని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
సుధామూర్తి ప్రస్థానం :
సుధామూర్తి అసలు పేరు సుధా కులకర్ణి. 19 ఆగస్ట్ 1950న కర్ణాటకలోని హవేరి జిల్లాలోని శిగ్గావిలో ఆమె జన్మించారు. ఆయన తండ్రి ఆర్ హెచ్ కులకర్ణి సర్జన్ కాగా.. తల్లి విమలా కులకర్ణి స్కూల్ టీచర్. ఆమె బాల్యం తల్లిదండ్రులు, అమ్మమ్మ గారింట్లో గడిచింది. సుధామూర్తి బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీఈ చదివారు. అనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంఈ పూర్తి చేశారు. విద్యాభ్యాసం తర్వాత టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీలో చేరారు.
ఆమె ఈ కంపెనీలో తొలి మహిళా ఇంజనీర్ కావడం గమనార్హం. పురుషాధిక్య సమాజంలో ఈ ఉద్యోగం కోసం సుధ రాజీలేని పోరాటం చేశారు. డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఈ కంపెనీలో చేరిన సుధామూర్తి.. పూణే, ముంబై, జంషెడ్‌పూర్‌లలో పనిచేశారు.
టాటా నుంచి తప్పుకున్న తర్వాత వాల్‌చంద్ గ్రూప్‌లో సీనియర్ సిస్టమ్స్ అనలిస్ట్‌గా చేశారు. టాటాలో పనిచేస్తున్న సమయంలోనే ఎన్ఆర్ నారాయణ మూర్తిని ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు . కుమార్తె అక్షతమూర్తి.. ఈమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి.
ఈ దంపతుల జీవితంలో ఇన్ఫోసిస్ స్థాపన ఓ మైలురాయి. 1981లో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. ఆయనకు పనే జీవితమైపోయిందని.. ఎప్పుడూ బిజీగా వుండేవారని, 30 ఏళ్ల పాటు తాము ఏ ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదని సుధామూర్తి పేర్కొన్నారు.
ఇంటికి సంబంధించిన పనులు కూడా తానే చక్కదిద్దేదాన్నని.. పిల్లల బాధ్యత కూడా తానే తీసుకున్నానని సుధామూర్తి ఓ సందర్భంలో చెప్పారు. 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను స్థాపించిన సుధామూర్తి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఆమె చేసిన సేవలకు గాను 2006లో భారతదేశంలో నాల్గవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ వరించింది. అనంతరం 2023లో పద్మభూషణ్‌ను కేంద్రం ప్రధానం చేసింది. సామాజిక సేవతో పాటు రచయిత్రిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో ఆమె రచించిన ‘డాలర్ బహు ’ నవల ప్రశంసలు దక్కించుకోగా.. దీనిని తర్వాత ఆంగ్లంలోకి అనువదించారు. ఈ నవలను 2001లో జీటీవీలో ధారాహికగా తెరకెక్కించారు.
రూనా అనే కధను కూడా సుధామూర్తి రాయగా.. దీనిని మరాఠీలో సినిమాగా తీశారు. గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్న ఆమె.. పేద విద్యార్ధులకు కంప్యూటర్ జ్ఞానాన్ని చేరువ చేశారు . టీటీడీ బోర్డు మెంబర్‌గా సమయంలో స్వామి వారికి, భక్తులకు సేవ చేశారు.

Comments
Post a Comment