నా తమ్ముడు చాలా మంచోడు.. ఇలాంటోళ్లు అరుదు : అవినాష్ రెడ్డిపై జగన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్ధుల తరపున రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. దీనిలో భాగంగా మంగళవారం కడప జిల్లా మైదుకూరులో ఏర్పాటు చేసిన సభలో తన సోదరుడు , కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. యువకుడు, ఉత్సాహవంతుడు , మంచి చేసే మనసుందని సీఎం అన్నారు. చాలా తక్కువ మందికే ఇలాంటి మనసు వుంటుందన్నారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు తమ్ముడిపై వుండాలని ఆయన కోరారు.
మన ప్రభుత్వం వచ్చాక రాజోలి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామని.. కానీ కొన్ని అనివార్య కారణాలతో వేగంగా చేయలేకపోయామని జగన్ అంగీకరించారు. దేవుడి దయతో నాలుగు సంవత్సరాలు పుష్కళంగా వర్షాలు కురిశాయని.. అన్ని ప్రాజెక్ట్‌లలో నీళ్లు నిండాయని సీఎం అన్నారు. దీంతో రాజోలి ప్రాజెక్ట్ ప్రాముఖ్యత అర్ధం కాలేదని.. కానీ ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో దాని గొప్పతనం గమనించామని జగన్ పేర్కొన్నారు. ఈసారి అధికారంలోకి రాగానే ఖచ్చితంగా రాజోలి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
చంద్రబాబు అంటే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే గుర్తొస్తాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని జగన్ హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా వున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోందని సెటైర్లు వేశారు.
జగన్‌ను ఎందుకు చంపకూడదని చంద్రబాబు అంటున్నారని.. ఆయన సంస్కారానికి ఒక నమస్కారమంటూ ఎద్దేవా చేశారు. చేతకాని వాడికి కోపం ఎక్కువ అనే సామెత వుందని.. చంద్రబాబు కొత్త మేనిఫెస్టోకు విలువ, విశ్వసనీయత లేదని దుయ్యబట్టారు. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానంటే నమ్ముతారా అని జగన్ ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని.. ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రఘురామి రెడ్డిలను ఆశీర్వదించి, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.
— YSR Congress Party (@YSRCParty) April 30, 2024
-సీఎం @ysjagan#MydukurSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/IFmDSjt4E3
Comments
Post a Comment