వంగవీటి రాధా ఏది అడగడు .. కానీ ఈసారి ఆయనకు న్యాయం చేస్తా : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు , మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన ప్రజాగళం సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. తాను చాలా మందిని చూశానని, కానీ సిన్సియర్‌గా ప్రజలకు ఏదో చేయాలనే తపన వున్న నేత రాధా అని కొనియాడారు.
సాధారణంగా తండ్రి పేరు అడ్డుపెట్టుకుని పదవులు ఆశించేవారు ఎందరో వున్నారని.. కానీ రాధాకృష్ణ మాత్రం నిస్వార్ధంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై వుందని.. ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయమంటే అక్కడ రాధా పనిచేస్తున్నారని, దూసుకెళ్తున్నారని టీడీపీ చీఫ్ అన్నారు. తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని రాధాకృష్ణ నిరంతర శ్రమిస్తున్నారని చెప్పారు. రాధాకృష్ణ సేవలు రాష్ట్రానికి అవసరమని.. ఆయనకు తప్పకుండా తగిన గుర్తింపునిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాగా.. రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న వంగవీటి రాధాకృష్ణకు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయవాడ సెంట్రల్, ఈస్ట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో ఇప్పుడు రాధా పరిస్ధితి ఏంటన్నది చర్చనీయాంశమైంది.
వంగవీటి రాధా ప్రస్థానం :
వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సక్సెస్‌ఫుల్‌గా రాధా కెరీర్ సాగుతున్న దశలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రాధాబాబు.
2009లో పీఆర్‌పీ టికెట్‌పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. తదనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో రాధా తిరిగి కాంగ్రెస్ మనిషిగా మారారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత హస్తం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం కావడంతో రాజకీయ భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు రాధా.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌తో వచ్చిన విభేదాల కారణంగా వైసీపీకి రాజీనామా చేసి సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.
అప్పటికే అభ్యర్ధుల ఎంపిక పూర్తి కావడంతో తను పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసారి కూడా రాధా కూటమి అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను బట్టి కూటమి ప్రభుత్వంలో రాధాకు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వంగవీటి రాధా గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం..
— Telugu Insider (@telugu_insider) April 30, 2024
తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ! #TDP #VangaveetiRadha #ChandrababuNaidu #PrajaManifesto #PrajaGalam #APElections2024 #AndhraPradesh #TeluguInsider pic.twitter.com/kYXaZDRw16

Comments
Post a Comment