సీఎం రివర్స్ డ్రైవింగ్ .. రాష్ట్రం సర్వ నాశనం : జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

 


ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ రివర్స్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని.. ఈ ముఖ్యమంత్రి డ్రామాల రాయుడని, సానుభూతితో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలంటే హత్యలు కాదని, హంతకుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు హెచ్చరించారు. 

జగన్ బటన్ నొక్కింది ఎంత..? బొక్కింది ఎంత..? అని ఆయన ప్రశ్నించారు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన ఆశయమని, తాము అధికారంలోకి రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జే బ్రాండ్, గంజాయి వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని .. ఈసారి కేంద్రంలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని టీడీపీ అధినేత జోస్యం చెప్పారు. కేంద్రంలో జగన్ ఎవరికి మద్ధతిస్తారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

అంతకుముందు కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మండుటెండల్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సరికాదని.. ప్రభుత్వ సిబ్బంది వున్నా ఇంటింటికీ పింఛను ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఎన్నికల సంఘం చెప్పిన రాష్ట్ర అధికారులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పింఛను తీసుకునే క్రమంలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని చంద్రబాబు హెచ్చరించారు. పింఛను కోసం గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పించారని.. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని టీడీపీ అధినేత మండిపడ్డారు. 


Comments