విశాఖ లోక్‌సభ నియోజకవర్గం : కూటమి అభ్యర్ధిగా శ్రీభరత్ .. ‘‘ పాపం ’’ జీవీఎల్ అంటోన్న మద్ధతుదారులు
దేశంలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు డబుల్ బొనంజా అన్నట్లుగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా.. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అందరికంటే ముందే అభ్యర్ధులను పలు దఫాలుగా ప్రకటించిన జగన్.. ప్రచారంలోనూ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘‘ సిద్ధం ’’ పేరుతో భారీ బహిరంగసభలు నిర్వహించిన ముఖ్యమంత్రి .. ప్రస్తుతం ‘‘మేమంతా సిద్ధం’’ పేరిట బస్సు యాత్రకు దిగారు. ప్రత్యర్ధులపై వాడివేడి విమర్శలు చేస్తూ , తాను అందించిన పథకాలు, మరోసారి అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తున్నారు. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించడంతో పార్టీలో ఒకరిద్దరు తప్పించి పెద్దగా అసంతృప్తి లేదు.
వైసీపీలో పరిస్ధితి ఇలా వుంటే.. కూటమిలో రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. కొన్ని స్థానాలకు ఇంకా అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది. ఆయా సెగ్మెంట్లలో వున్న సామాజిక , ఆర్ధిక కారణాలను దృష్టిలో పెట్టుకుని మేం పోటీ చేస్తామంటే .. మేం పోటీ చేస్తామంటూ టీడీపీ, జనసేన, బీజేపీలు కొట్టుకుంటున్నాయి. కొందరు నేతలు పార్టీలు మారైనా సరే టికెట్లు దక్కించుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది.
పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ విశాఖలో పోటీ చేయాలని నిర్ణయించగా.. బీజేపీ, జనసేనలు సమ్మతించాయి. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు కూడా. కానీ అనూహ్యంగా బీజేపీ విశాఖ ఎంపీ సీటు తమకు కేటాయించాల్సిందిగా లోకల్ కేడర్ పట్టుబడుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వున్న జీవీఎల్ నరసింహారావును బరిలో దించాలని వారు కోరుతున్నారు. విశాఖ సీటును ఆశించే దాదాపు మూడేళ్ల క్రితమే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు జీవీఎల్. ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర స్థానిక సమస్యల పరిష్కారం కోసం నరసింహారావు కృషి చేసి విశాఖ వాసుల ఆదరణను పొందారు.
టీడీపీతో పొత్తు కుదరకపోయుంటే ఖచ్చితంగా జీవీఎల్ విశాఖ బరిలో నిలిచేవారు. కానీ తెలుగుదేశంతో పార్టీ పెద్దలు పొత్తు పెట్టుకోవడంతో జీవీఎల్ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. కొందరు జీవీఎల్ మద్ధతుదారులు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ విశాఖ ఎంపీ సీటు బీజేపీ ఖాతాలో పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అనేక జాతీయ స్థాయి సంస్థలకు కేంద్రంగా వున్న వైజాగ్‌లో దేశంలోని అన్ని ప్రాంతాల వారు స్థిరపడ్డారు. వీరిలో ఉత్తరాది వారు అధికం.
సహజంగానే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం ఎక్కువ. దీనికి తోడు గతంలో గెలిచిన ట్రాక్ రికార్డు కూడా వుండటం, జీవీఎల్ నరసింహారావు నగరానికి మకాం మార్చిన తర్వాత కేడర్‌లో జోష్ నెలకొనడంతో ఆయనను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జీవీఎల్ అనుకూల వర్గం నిరసన నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఒకవేళ బీజేపీ వైజాగ్ సీటును కోరితే ఏం చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
.jpg)
Comments
Post a Comment