ఈ బెంగళూరుకు ఏమైంది.. మండిపోతోందిగా, ముంబై బెటర్ అంటోన్న నెటిజన్లు
బెంగళూరు.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన వాతావరణం. ఎంతటి వేసవి కాలమైనా చల్లగా, ఏమాత్రం ఇబ్బంది పెట్టని క్లైమేట్ ఈ నగరం సొంతం. అందుకే చాలా మంది బెంగళూరుకు వెళ్లి సేద తీరాలని అనుకుంటూ వుంటారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు బెంగళూరు అంటే అమ్మో అనే పరిస్థితులు నెలకొన్నాయి.
గార్డెన్ సిటీగా పేరు గాంచిన బెంగళూరులో ప్రస్తుతం వృక్షాలు మాయమై.. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్‌లా మారిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు, నగర విస్తరణ కార్యక్రమాల కోసం ఇక్కడ పెద్ద సంఖ్యలో వృక్షాలను తొలగించడంతో బెంగళూరు వాతావరణంలో నానాటికీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రస్తుతం బెంగళూరును నీటి కష్టాలు వణికిస్తున్నాయి. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో నగరంలో నీటి కొరత ఏర్పడింది. దాదాపు నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేనివిధంగా నగర ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలతో నీటి సరఫరా చేస్తున్నా అవి ఏ మూలకు చాలడం లేదు.
ఇక ఐటీ ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం నీటి సంక్షోభం నేపథ్యంలో రెండు రోజులకు ఓసారి స్నానం చేస్తూ.. ఆహారం కోసం ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నారు. నీటి కొరత నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఇంకొంత కాలం పొడిగించాలని టెక్కీలు కోరుతున్నారు. అటు అద్దెకు వుండే కుటుంబాలకు నీటి వాడకంపై భవన యజమానులు ఆంక్షలు విధిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా వర్షం లేదు.. నీళ్లు లేవు, నీటిని పొదుపు చేయండి అనే నినాదాలు కనిపిస్తున్నాయి.
ఈ సంగతి పక్కనబెడితే.. ఎండాకాలం కావడంతో గార్డెన్ సిటీ ఇప్పుడు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే .. 2016 ఏప్రిల్‌లో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలను త్వరలోనే బద్ధలు కొట్టడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దురదృష్ట ఘటనలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇష్టపడి బెంగళూరుకు తరలివెళ్లిన లక్షలాది మందిని కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరు వర్సెస్ ముంబై అనే చర్చ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. రెండు నగరాల వాతావరణాన్ని పోల్చి చూస్తు.. ఈ విషయంలో ఇప్పుడు ముంబై చాలా బెటర్ అంటూ నెటిజన్లు వాదిస్తున్నారు.
ఈ వేసవిలో హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కొన్న భారతీయ రాష్ట్రాల్లో కర్ణాటక వున్నప్పటికీ.. ఎండా కాలం ప్రారంభంలో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లోనే ఈ పరిస్ధితులు కేంద్రీకృతమై వున్నాయి. కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు ఎండ వేడితో కాలిపోతున్న స్థితిని అనుభవిస్తున్నాయి. గత మంగళవారం బెంగళూరులో 37.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఈ దశాబ్ధ కాలంలో సిలికాన్ సిటీ అనుభవించిన రెండవ హాటెస్ట్ డే .
ఇలాంటి పరిస్ధితుల వేళ.. బెంగళూరు వాసులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో నగరంలో వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ జల్లులు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయో లేదోనన్న అనిచ్చితి నెలకొంది.
"But Bangalore has the best weather🤡 "
— Phunsuk Wangdu (@Phunsukwangduji) April 7, 2024

Comments
Post a Comment