భగభగమండే ఎండల్లో తెలంగాణకు చల్లని కబురు.. వచ్చే ఐదు రోజులూ వర్షాలే

 



ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతోన్న తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుమెులు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. సెంట్రల్ మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం .. కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. 

ఆవర్తనం కారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఇవాళ మాత్రం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. వచ్చే ఐదు రోజులూ తెలంగాణలో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశం వుంటుందని ఐఎండీ తెలిపింది. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం వున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటి పట్టునే వుండాలని.. వృద్థులు, గర్బిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కూల్‌డ్రింక్స్‌కు బదులుగా నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీటిని తరచుగా తీసుకోవాలని పేర్కొన్నారు. 



Comments