మాల్దీవులపై దయ చూపిన భారత్ .. ఆ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

 



హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం మాల్దీవులు భారత్‌కు తొలి నుంచి మిత్రదేశమన్న సంగతి తెలిసిందే. అయితే మొహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్‌పై విషం కక్కుతూ వస్తున్నారు. చైనాకు గట్టి మద్ధతుదారుడిగా వున్న ఆయన .. తన చర్యలతో భారత్‌కు దూరం జరుగుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లక్షద్వీప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించిన తర్వాత .. మాల్దీవులకు చెందిన మంత్రులు , రాజకీయ నాయకులు మనదేశంపైనా , మోడీపైనా జాతి విద్వేష వ్యాఖ్యలకు దిగారు.  

దీనిపై భగ్గుమన్న భారతీయులు ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్ ’’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. దీనికి సెలబ్రిటీలు సైతం జత కలవడంతో మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య పడిపోయింది. దీంతో ఆ దేశ పర్యాటక రంగంపై పెను ప్రభావం పడటంతో పాటు ఆర్ధిక వ్యవస్థకు దెబ్బతగిలింది. ముయిజ్జు వైఖరిపై సొంత పార్టీతో పాటు విపక్షనేతలు సైతం భగ్గుమంటున్నారు. 

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. మాల్దీవులకు నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. కేంద్రం నిర్ణయంతో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు, గోధుమపిండి వంటి వస్తువులను మాల్దీవులకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది. 

ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీటి ఎగుమతులపై మినహాయింపు ఇస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్రకటించింది. అంతర్జాతీయ పరిస్ధితులు, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఆహార కొరత, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో దేశీయంగా ధరలు పెరగకుండా బియ్యం, చక్కెర, ఉల్లి ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది.


Comments