ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ .. వచ్చే ఏడాది చివరి నాటికి భారత్ చేతికి మిగిలిన రెండు
భారత్‌తో కుదుర్చుకున్న 5.4 మిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం ప్రకారం మిగిలిన రెండు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను 2025 నాటికి పంపిణీ చేస్తామని రష్యా తెలిపినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్టోబర్ 2018లో ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అన్ని డెలివరీలు ఐదేళ్ల కాలవ్యవధిలోగా పూర్తి కావాలి.
అయితే ఉక్రెయిన్ వివాదం, పశ్చిమ దేశాల ఆంక్షలు ఈ ఒప్పందంపై ప్రభావం చూపాయి. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయ భద్రత, రక్షణ అవసరాలను దృష్టిలో వుంచుకుని భారత్‌కు ఎస్-400 ఆంక్షల నుంచి మినహాయింపునివ్వాలని యూఎస్ చట్టసభ సభ్యులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మిగిలిన రెండు ఎస్-400 వ్యవస్థలు వచ్చే ఏడాది చివరి నాటికి భారత్‌కు అందే అవకాశం వుందని ఓ అధికారి చెప్పారు.
Countering America’s Adversaries Through Sanctions Act (CAATSA) చట్టం కింద అమెరికా వ్యతిరేకులను ఎదుర్కోనేందుకు గాను భారత్-రష్యా ఒప్పందంపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అయినప్పటికీ పెద్దన్న హెచ్చరికలను భేఖాతరు చేస్తూ భారత్ ముందుకు సాగింది. అదే చట్టం ప్రకారం ఎస్-400ని కొనుగోలు చేసినందుకు టర్కీపై సెకండరీ ఆంక్షలు విధించగా.. భారత్‌పై మాత్రం అగ్రరాజ్యం అంతటి సాహసానికి దిగలేదు. న్యూఢిల్లీ-వాషింగ్టన్‌ల మధ్య పెరుగుతున్న భద్రత, వ్యూహాత్మక సంబంధాలు కూడా ఇందుకు కారణం కావొచ్చునన్నది విశ్లేషకుల మాట.
రష్యా ఇప్పటి వరకు మూడు ఎస్-400 రక్షణ వ్యవస్థలను భారత్‌కు డెలివరీ చేసింది. వీటిని నార్త్ సెక్టార్‌లో చైనాతో భాగం పంచుకునే సరిహద్దుల్లో, పాకిస్తాన్ సరిహద్దును కవర్ చేయడానికి మోహరించినట్లుగా తెలుస్తోంది. వ్యూహాత్మక ప్రాంతాలు, ఆస్తులను రక్షించడానికి రెండు వ్యవస్థలను ఉపయోగించనున్నారు.
అసలేంటీ ఎస్-400 సిస్టమ్ :
ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లలో ఒకటిగా రక్షణ రంగ నిపుణులు ఎస్-400ను అభివర్ణిస్తారు. శత్రుదేశాల నుంచి దూసుకొచ్చే క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్ధ్యం వీటి సొంతం. ఎక్కడికి కావాలంటే అక్కడికి వీటిని సులభంగా తరలించవచ్చు. యాక్టివ్ రాడార్ హోమింగ్ హెడ్ అనే సాంకేతికత సాయంతో టార్గెట్‌ను గుర్తించి నాశనం చేస్తుంది. 400 కిలోమీటర్ల దూరం 30 కి.మీ ఎత్తులో వున్న క్షిపణులను పేల్చేయడంతో పాటు 9 నుంచి 10 సెకన్లలోనే ఎదురుదాడికి సిద్ధం కావడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఎస్-400 సర్వీస్ జీవితకాలం 20 ఏళ్లు. అలాగే ఈ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గైడెడ్ మిస్సైల్స్ జీవితకాలం 15 ఏళ్లు.
Comments
Post a Comment