ఎన్నికలొస్తే తెగ వినిపిస్తుంది .. అసలేంటీ ‘‘ బీ-ఫారం ’’..?
ఎన్నికల సీజన్ మొదలైందంటే బీ-ఫారం అన్న మాట తరచుగా వినిపిస్తూ వుంటుంది. ఫలానా పార్టీ అధినేత అభ్యర్ధులకు బీ-ఫారం ఇచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు బీ ఫారం అంటే ఏంటి ..? ఇది ఎందుకు ఇస్తారు..? ఇవ్వడం తప్పనిసరా..? దీనిని అభ్యర్ధులు తీసుకోకుంటే ఏమైనా జరుగుతుందా..అన్నది ఒకసారి పరిశీలిస్తే.
Also Read : అయోధ్యలో రామయ్య నుదిటిన ‘‘సూర్య తిలకం ’’ .. ప్రతి శ్రీరామనవమికి ఎలా సాధ్యం..?
ఎన్నికల్లో పాల్గొనాలని , ప్రజలకు సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ అందరికీ పార్టీలు టికెట్లు కేటాయించలేవుగా. పార్టీ తరపున అధికారికంగా అభ్యర్ధిత్వం ఖరారైన వారికి బీ ఫాంలు కేటాయిస్తారు. తాము ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తున్నామా.. లేక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నామా అన్నది అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాల్లో తెలియజేస్తారు. ఇందుకోసమే రాజకీయ పార్టీలు ఒక పత్రాన్ని అభ్యర్ధులకు అందిస్తారు. దీనినే ‘‘ బీ-ఫారం ’’గా పిలుస్తారు. దీని ద్వారా ఒక వ్యక్తి/అభ్యర్ధి ఏ రాజకీయ పార్టీ తరపున బరిలో నిలిచినది తెలుస్తుంది.
భారతదేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు బీ ఫారం ఇస్తాయి. నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్ధులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని సమర్పిస్తే.. దీని ఆధారంగా ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తును అతనికి కేటాయిస్తారు . ఎన్నికల ప్రచారంలోనూ ఆ గుర్తు వాడుకునే వెసులుబాటు సంబంధిత అభ్యర్ధికి వుంటుంది. సంబంధిత పార్టీ అధ్యక్షులు లేదా పార్టీ నియమించిన ప్రత్యేక ప్రతినిధులు ఈ ఫారాన్ని అభ్యర్ధికి అందజేస్తారు.
తొలుత రాజకీయ పార్టీలు బీ ఫారంలు అందించే వ్యక్తికి ‘‘ ఏ -ఫారం ’’ ఇస్తారు. వీరికి మాత్రమే అభ్యర్ధులకు బీ ఫారంను అందించే అధికారం వుంటుంది. సదరు ఏ- ఫారాన్ని పార్టీ ప్రతినిధి ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఇందులో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధుల పేర్లు, పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం, పార్టీ అధికారిక ముద్ర వుంటుంది.
Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?
కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 21న బీఫారంలు అందజేయనున్నారు. గురువారం పార్టీ జోనల్ ఇన్‌చార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్ధులకు చంద్రబాబు బీ ఫారంలు అందజేయనున్నారు. తొలుత జోనల్ ఇన్‌ఛార్జీల ద్వారానే బీఫారంలు ఇప్పించాలని నిర్ణయించగా తర్వాత చంద్రబాబు చేతుల మీదుగానే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Comments
Post a Comment