ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల .. కనిపించని పురందేశ్వరి

 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా బరిలో దిగిన సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్ధుల తరపున మూడు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మూడు పార్టీల నేతలు దీనిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. 

అయితే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఈ కీలక కార్యక్రమానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు మేనిఫెస్టో బుక్‌లెట్‌పై కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఫోటోలు మాత్రమే వుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ, పురందేశ్వరి ఫోటోలు కానీ ఆ పార్టీ గుర్తు కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే మేనిఫెస్టోకు తమ మద్ధతు వుందన్నారు బీజేపీ నేత సిద్ధార్ధ్ నాథ్ సింగ్. తాను ఇక్కడ వున్నానంటే బీజేపీ మద్ధతు వుందనే అర్ధమని ఆయన వ్యాఖ్యానించారు. తాము జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేశామని సిద్ధార్థ్ అన్నారు. 

అటు చంద్రబాబు సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. మేనిఫెస్టోకు బీజేపీ మద్ధతు వుంటుందన్న ఆయన.. మేనిఫెస్టోలో బీజేపీ భాగం పంచుకోలేదన్నారు. అమలు బాధ్యత టీడీపీ, జనసేనలదేనని.. తమకు కేంద్రం అండదండలు వున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పురందేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం వెనుక  కూడా కారణాలు వున్నట్లుగా తెలుస్తోంది. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో పురంధేశ్వరి వున్నందునే ఆమె రాలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. 


Comments