ఏపీ అసెంబ్లీ ఎన్నికలు .. బోండా ఉమాను అనర్హుడిగా ప్రకటించాలి : వెల్లంపల్లి శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి బొండా ఉమాపై విమర్శలు గుప్పించారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అన్నారు. ఆయనపై తాము మూడు ఫిర్యాదులు చేశామని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
టీడీపీ ఆఫీస్‌లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు వున్నాయని.. ఆయన పోటీ చేసేందుకు అనర్హుడని వెల్లంపల్లి ఆరోపించారు. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడ చూపించారని.. మరో కుమారుడు కూడా విదేశాల్లో వుంటారని చెప్పి అతని ఓటు కూడా ఇక్కడే చూపించారని శ్రీనివాసరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారని.. తాను ఎమ్మెల్యేగా గెలిచాక సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటానని ఆయన తెలిపారు.
తప్పుడు పత్రాలతో బోండా ఉమా ఓటు చూపించాడని, ఆయనను అనర్హుడిగా ప్రకటించేవరకు పోరాడతానని వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతేకాకుండా దాదాపు 2.50 కోట్ల ఇన్‌కం ట్యాక్స్‌ను ఎగ్గొట్టాడని.. ఆయనో ఆర్ధిక నేరస్తుడని వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెండింగ్‌లో వున్న కేసులను అఫిడవిట్‌లో పొందుపరచలేదని.. ఆ కేసులపైనా న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మేం ప్రచారం చేయకుండా రాజకీయం చేస్తున్నాడని, మా హక్కులకు భంగం కలిగిస్తున్నాడని శ్రీనివాసరావు ఆరోపించారు. ఓటమి భయంతోనే బోండా ఉమా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఆయనను ఖచ్చితంగా ఓడిస్తామని వెల్లంపల్లి హెచ్చరించారు.
Comments
Post a Comment