చిరంజీవిని జగన్ అవమానిస్తుంటే .. నీకు సిగ్గుగా లేదా : కన్నబాబుపై పవన్ నిప్పులు

 


ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైనా జగన్ కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలకు వచ్చినా గంజాయి దొరుకుతుందని, కూటమి అధికారంలోకి వచ్చాక గంజాయిని అమ్మేవాళ్లను అణిచివేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబులకు నరకం అంటే ఏంటో చూపిస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి అంతు చూసేందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ తెలిపారు. కాకినాడ రూరల్‌లో ఎమ్మెల్యే కన్నబాబు అవినీతికి పాల్పడుతున్నారని.. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయనకు ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని జనసేనాని ఆరోపించారు.

జగన్‌ను గద్దె దించడానికి యువత పోరాడాలని, ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాకినాడ తీరంలో పడవలు దగ్ధమవుతున్నాయని.. ఇది గంజాయి స్మగ్లర్ల పనేనని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో 16, 17 ఏళ్ల వయసున్న యువత గంజాయికి బానిసలుగా మారుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ వద్ద ఓ డొక్కు స్కూటర్‌పై తిరిగిన కన్నబాబు ఇవాళ పెద్ద నాయకుడు అయిపోయాదని పవన్ పేర్కొన్నారు. చిరంజీవి వేసిన భిక్ష వల్లే కురసాల కన్నబాబు నాయకుడు అయ్యాని.. కానీ నాడు జగన్ చిరంజీవిని అవమానిస్తే కన్నబాబుకు సిగ్గుగా అనిపించలేదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కురసాల కన్నబాబే మూలకారకుడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కన్నబాబు.. ఇలా .. రా .. అంటే పరిగెత్తుకుని వచ్చేవాడని ఆయన గుర్తుచేశారు. 


Comments