ఆపరేషన్ కుప్పం .. ఈసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయం : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలపై ఆసక్తి నెలకొంది. అలాంటి వాటిలో కుప్పం ఒకటి. తెలుగుదేశం పార్టీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1989 నుంచి నేటి వరకు చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా వుంది. ప్రచారానికి రాకపోయినా , అడపాదడపా వచ్చినా కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపిస్తూనే వున్నారు.
తెలుగుదేశం కంచుకోటను బద్దలుకొట్టాలని హేమాహేమీలైన నేతలు వ్యూహాలు రచించారు. కానీ కుప్పం వాసులు మాత్రం చంద్రబాబు వెంటే వున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత కుప్పంలో పరిస్థితులు మారాయి. వై నాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలతో జగన్ దూకుడు పెంచారు. కాస్త శ్రమిస్తే కుప్పంలో గెలవడం పెద్ద కష్టం కాదని జగన్ చెబుతూ వస్తున్నారు.
ఆయనకు తోడు చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధిగా వున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశానికి షాకిచ్చిన వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని కృతనిశ్చయంతో వుంది. వైసీపీ వ్యూహాలతో అలర్ట్ అయిన చంద్రబాబు నాయుడు. ఎన్నడూ లేనివిధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
ఇదిలావుండగా.. కుప్పంలో వైసీపీ తరపున కేఆర్‌జే భరత్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయయాత్రగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుకు కుప్పంలో ప్రజలు బుద్ధి చెబుతారని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈసారి కుప్పంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Post a Comment