వైసీపీ మేనిఫెస్టోలో ఏమైనా వుందా.. జగన్ చేతులెత్తేసినట్లే : చంద్రబాబు నాయుడు విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని వైసీపీ అధినేత , ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ మేనిఫెస్టోలో ఏమైనా వుందా.. జగన్ చేతులెత్తేశారని ఆయన సెటైర్లు వేశారు. జగన్ సతీమణి పసుపు డ్రెస్ వేసుకుంటే ఆమెకు కూడా కటీఫ్ చెబుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామని .. మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలాపెట్టారని టీడీపీ అధినేత మండిపడ్డారు.
గొడ్డలి పెట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి కావాలా.. పిచ్చోడి దగ్గర అధికారం వుండటం మంచిది కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ గులకరాయి ఎవరికీ కనిపించలేదని.. అయినా జగన్‌కు గాయమైందని, జగన్ చేసిన ఘోరాలు చెప్పుకుంటూ పోతే ఐదేళ్లయినా సరిపోదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనని.. జగన్ ఎవరికి మద్ధతిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని.. కానీ ఆర్ధిక వ్యవస్థ గురించి ఆయనకు ఏమీ తెలియదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ అసెంబ్లీ కౌరవ సభ అని నాడే చెప్పానని.. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని పేర్కొన్నాడు.
అంతకుముందు వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇవాళ జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక.. ఎన్నికలకు ముందే రాజీనామా లేఖలా అనిపించిందన్నారు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి అస్త్ర సన్యాసం చేసినట్లుగా వుందన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తారని నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

Comments
Post a Comment