పాపం చేసిన వాళ్లని వదలొద్దు .. తొక్కిపడేయండి : బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు

 


ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అన్నింటిలోకి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల విమర్శలు, ప్రతి విమర్శలపై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల ప్రచారం చేసి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఐదేళ్లు గడిచేసరికి అదే అన్నకు ప్రత్యర్ధిగా, ఆయనపైనే వాడి వేడి విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి పోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

ఇలాంటి పరిస్ధితుల్లో సీన్‌లోకి షర్మిల భర్త , క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ వచ్చారు. పాపాలు చేసినవారిని తొక్కి పడేయాలని ఆయన పిలుపునిచ్చారు. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలోని ఓ చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని, పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదన్నారు. 

ధైర్యంగా వారిని ఎదుర్కోవాలని.. ఎవరికీ భయపడొద్దని, యేసుక్రీస్తు అండగా వున్నాడని.. దేవునిపై విశ్వాసం వుంచి నిర్ణయం తీసుకోండి అని బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినవేనా అనే చర్చ నడుస్తోంది. 

కాగా.. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. కడప పార్లమెంట్ స్థానం వైఎస్ కుటుంబానికి కంచుకోట. దశాబ్థాలుగా వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాంటిది తొలిసారిగా పెద్దాయన కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకే ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో కడప ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారోనన్న ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. 


Comments