కొడాలి నాని నామినేషన్‌పై వివాదం .. తేడా వస్తే ఎన్నికల నుంచి ఔట్, ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ
గుడివాడను అడ్డాగా చేసుకుని దశాబ్థాలుగా రాజకీయాలు చేస్తున్నారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) . తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా వున్న నానికి.. 2019లో జగన్ తన కేబినెట్‌లో భాగం కల్పించారు. అనంతరం మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణలో భాగంగా ఆయనను మంత్రి మండలి నుంచి తప్పించారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలపై ఒంటికాలిపై లేస్తారు నాని. సీఎం వైఎస్ జగన్, వైసీపీపై ఈగ వాలినా వాడి వేడి విమర్శలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని ఈసారి గుడివాడలో ఓడించాలని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు టికెట్ ఖరారు చేసి ఆయనకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు.
నియోజకవర్గంలో బలంగా వున్న కమ్మ సామాజిక వర్గానికి తోడు ఇప్పుడు పవన్ కారణంగా కాపులు కూడా కలిసొస్తుండటంతో నానిని ఓడించాలని టీడీపీ కృతనిశ్చయంతో వుంది. అయితే మరోసారి గుడివాడలో గెలిచి చూపిస్తానంటూ నాని ఛాలెంజ్‌లు విసురుతున్నారు. ఇలాంటి వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడాలి నాని దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది.
డాక్యుమెంట్లలో కొడాలి నాని తప్పుడు సమాచారం ప్రస్తావించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని తన క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారని టీడీపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లుగా అధికారులు పేర్కొన్న పత్రాలను కూడా ఫిర్యాదుతో పాటు సమర్పించారు.
నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కొడాలి నాని నామినేషన్‌ను తిరస్కరించాలని ఆర్వోను తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది.
ఒకవేళ ఈ నామినేషన్‌ను ఆర్వో కనుక తిరస్కరిస్తే.. కొడాలి నానికి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు. ఎందుకుంటే 2024 ఎన్నికలే తన జీవితంలో చివరివని నాని ఇప్పటికే ప్రస్తావించారు గనుక. మరోవైపు.. కొడాలి నాని సోదరుడు చిన్ని సైతం నామినేషన్ దాఖలు చేశారు. ఒకవేళ నాని నామినేషన్‌ను ఆర్వో తిరస్కరిస్తే.. కొడాలి చిన్ని అభ్యర్ధిగా వుంటారు. లేనిపక్షంలో కొడాలి నానినే అభ్యర్ధిగా బరిలో నిలుస్తారు. మరి గుడివాడలో ఏం జరుగుతుందో చూడాలి.

Comments
Post a Comment