పెండింగ్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ .. వైసీపీకి మరో కొత్త టెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో ఆయన మండుటెండల్లోనూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా పార్టీలోని కీలక నేతల నామినేషన్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణాలు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్వో తీసుకునే నిర్ణయంపైనే ఆయన పోటీ చేసేది లేనిది ఆధారపడి వుంది.
తాజాగా మరో సీనియర్ నేత, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ విషయంలోనూ వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోసారి డోన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బుగ్గన నామినేషన్ దాఖలు చేశారు. అయితే శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. రాజేంద్రనాథ్ రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌పై టీడీపీ అభ్యర్ధి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని , నామినేషన్ పేపర్‌లలోని కొన్ని ఖాళీలను భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు వున్నాయని.. వెంటనే ఆయన నామినేషన్ తిరస్కరించాలని న్యాయవాది కోరారు. టీడీపీ ఫిర్యాదుపై రిటర్నింగ్ అధికారి (ఆర్వో) స్పందించారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్‌ను పెండింగ్‌లో వుంచారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల లోగా ఆస్తుల వివరాలు సమర్పించాలని బుగ్గన తరపున న్యాయవాదికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. బుగ్గన నామినేషన్‌పై తాము ఫిర్యాదు చేసినప్పటికీ దానిని తిరస్కరించకుండా పెండింగ్‌లో పెట్టడంపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Post a Comment