ఆప్‌లో ‘‘లిక్కర్ స్కాం’’ ప్రకంపనలు .. పార్టీని వీడిన మంత్రి , అవినీతికి అడ్డా అంటూ వ్యాఖ్యలు

 



ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌, సత్యేందర్ జైన్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇలాంటి పరిస్ధితుల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్‌కు సన్నిహితుడు, మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. రాజీనామా చేసే వరకు ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

పార్టీని వీడుతూ.. ఆప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాడాలనే లక్ష్యం, ప్రజలకు సేవ చేసేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానని.. కానీ ఇవాళ పార్టీయే అవినీతికి అడ్డాగా మారిపోయిందని రాజ్‌కుమార్ ఆరోపించారు. ఆప్‌లో నాయకత్వం , పదవుల విషయంలో వివక్ష వుందని , తాను దళితుల కోసం పనిచేయలేనప్పుడు ఆ పార్టీలో వుండటం వృథా అని అందుకే ఆప్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని రాజ్‌కుమార్ చెప్పారు. ఢిల్లీలోని పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు రాజ్‌కుమార్. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేయడం కూడా ఇదే తొలిసారి. 

మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఈ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడం, అనంతరం కోర్టు తనను కస్టడీకి ఇవ్వడం అక్రమమంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ విజయావకాశాలను దెబ్బతీసేందుకే ఈడీ తనను అరెస్ట్ చేసిందన్న కేజ్రీవాల్ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 

గత వారం ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను షింఘ్వీ.. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. తీర్పు సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్ ద్వారా అక్రమార్జనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని వ్యాఖ్యానించింది. అందువల్ల కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం సరైనదేనని బెంచ్ పేర్కొంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రన ప్రత్యేకంగా హక్కులు వుండవని.. సామాన్యులైనా, సీఎం అయినా చట్టం అందరికీ ఒకటేనని హైకోర్ట్ వెల్లడించింది. 

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోని మనీలాండరింగ్ అంశానికి సంబంధించిన కేసులో ఈడీ మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో వున్న అనంతరం ట్రయల్ కోర్ట్ కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను తీహార్ జైల్లోని ఓ చిన్న గదికి తరలించారు. రెండో నెంబర్ జైలులో వున్న కేజ్రీవాల్ ప్రతినిత్యం ధ్యానం, యోగాతో పాటు పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

కేజ్రీవాల్ వున్న గదిలో 20 టీవీ ఛానెళ్లు చూసే అవకాశం వుంది. కానీ దానిని చూసేందుకు ఆయన అంతగా ఇష్టపడటం లేదని సమాచారం. సెల్‌లో రెండు సీసీ కెమెరాల ద్వారా 24 గంటలూ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను పర్యవేక్షిస్తున్నారు. వీవీఐపీ కావడంతో భద్రతా కారణాల రీత్యా తోటి ఖైదీలతో ఆయనను కలిసేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. సెల్ బయట సీఆర్‌పీఎఫ్, తమిళనాడు  స్పెషల్ పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. 

Comments