ఏపీ వాసులకి వాతావరణ శాఖ అలర్ట్ .. వచ్చే 3 రోజులు ఈ జిల్లాల్లో వేడిగాలులు
ఏప్రిల్ మొదటివారంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ వుండటంతో రాబోయే రోజులు ఇంకెలా వుంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కొబ్బరినీళ్లు, శీతల పానీయాలను జనం ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను చెప్పింది. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం వుందని తెలిపింది.
నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్‌ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐఎండీ కీలక సూచనలు చేసింది. దాహంగా వున్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తగినంత నీరు తాగాలని.. తేలికైన, లేత రంగు, వదులుగా వుంటే కాటన్ దుస్తులను ధరించాలని సూచించింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చలువ కళ్లద్దాలను, పాదరక్షలను ఉపయోగించాలని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎండలో పనిచేసేవారు టోపీ, గొడుగు వాడాలని.. తల, మెడ, ముఖం, చేతులకు తడిగుడ్డను పెట్టుకోవాలని, ద్రవ పదార్ధాలు ఎక్కువగా తాగాలని సూచించింది. వేడి దద్దుర్లు, నీరసం, మైకం, తలనొప్పి, వికారం, చెమటలు, మూర్చ వంటి హీట్ స్ట్రోక్ లక్షణాల పట్ల ప్రజలు జాగ్రత్తగా వుండాలని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 3న నంద్యాలలో గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. కర్నూలు (42.7 °), అనంతపురం (42.6 °), కడప (42.2 °) నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Comments
Post a Comment