రోడ్డు ప్రమాదంలో నటుడు పంకజ్ త్రిపాఠి బావ దుర్మరణం, సోదరికి తీవ్రగాయాలు

 



ప్రముఖ సినీనటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన బావ రాకేష్ తివారీ మరణించగా.. సోదరి సబితా తివారీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఢిల్లీ - కోల్‌కతా జాతీయ రహదారి-2లోని నిర్సా బజార్ వద్ద సాయంత్రం 4.30 గంటల సమయంలో రాకేష్ దంపతులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బీహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని ధన్‌బాద్‌లోని షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే రాకేష్ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సబితా తివారీ మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా ఆసుపత్రి హెచ్‌వోడీ డాక్టర్ దినేష్ కుమార్ గిందౌరియా పీటీఐకి తెలిపారు. ప్రమాద సమయంలో రాకేష్ తివారీ స్వయంగా కారును డ్రైవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

పంకజ్ త్రిపాఠి.. మెయిన్ అటల్ హూన్, ఓఎంజీ 2, స్ట్రీ, లూడో వంటి బాలీవుడ్ చిత్రాలలో నటనకు గాను జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని పవర్‌ఫుల్ క్యారెక్టర్ కలీన్ భయ్యాతో ఆయన దేశవ్యాప్తంగా అందరికీ దగ్గరయ్యారు.  


Comments