కాంగ్రెస్ గూటికి ఆమంచి కృష్ణమోహన్ .. చీరాలలో రాజకీయం రసవత్తరం..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్తులు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లి.. టికెట్లు దక్కించుకుంటున్నారు. ఈ లిస్టులోకి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేరారు. ప్రస్తుతం వైసీపీలో వున్న ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమంచి కృష్ణమోహన్ వెల్లడించారు.
బుధవారం తన అనుచరులు, అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. టీడీపీ , వైసీపీలు తనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాయని ఆమంచి పేర్కొన్నారు.
కాగా.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కరణం వైసీపీకి జైకొట్టారు. దీంతో చీరాల వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. ఆమంచి , కరణం వర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాయి. మధ్యలో ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కూడా హడావుడి చేయడంతో చీరాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది.
పరిస్థితిని గమనించిన వైసీపీ హైకమాండ్ పలుమార్లు వీరిని తాడేపల్లికి పిలిపించింది కూడా. తదనంతరం ఆమంచి కృష్ణమోహన్‌ను.. పక్కనేవున్న పర్చూరుకు ఇన్‌ఛార్జ్‌గా పంపారు జగన్. కానీ అక్కడి నుంచి పోటీ చేయడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. కొన్నాళ్లు చూసి జగన్‌తో ఇక తన వల్ల కాదని ఆమంచి తేల్చిచెప్పేశారు. దీంతో ఆమంచి స్థానంలో యడం బాలాజీని ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు సీఎం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆమంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. చీరాలలో బలమైన వర్గాలుగా వున్న కాపు, పద్మశాలి, దేవాంగ, దళిత కమ్యూనిటీల్లో కృష్ణమోహన్‌కు మంచి పట్టుంది. గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ట్రాక్ రికార్డు కూడా వుండటంతో ఆయన కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని కృష్ణమోహన్ భావించారు. అయితే ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేయడంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పొక చెక్కలా మారింది. ఇండిపెండెంట్ బదులుగా ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేయాలని సన్నిహితులు ఆయనకు సూచించారు. దీంతో కొద్దిరోజులుగా చీరాలలో వరుస సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరిస్తున్నారు ఆమంచి.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాలని ఎక్కువ మంది సూచించడంతో అందుకు అనుగుణంగానే కృష్ణమోహన్ నిర్ణయం తీసుకున్నారు.
త్వరలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పారు. చీరాల ప్రజల మద్ధతుతో విజయం సాధిస్తానని కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు. అంతాబాగానే వుంది కానీ.. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయడం టీడీపీ, వైసీపీ శిబిరాల్లో ఆందోళనకు కారణమైంది. బలమైన నేతగా వున్న ఆయన ఎవరి ఓట్లు చీల్చుతారోనని అభ్యర్ధులు భయపడుతున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో చీరాలలో రాజకీయం వేడెక్కింది.
Comments
Post a Comment