దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్తున్నారా.. ఈ కొత్త రూల్స్ తెలుసా ..?

 




హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలిచింది. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటిగా మారింది. ఈ బ్రిడ్జ్‌పై ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇది వంతెనపై ట్రాఫిక్‌కు కారణమవుతోంది. నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంతగా చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం హద్దుమీరుతున్నారు. 

బ్రిడ్జిపై ఇరువైపులా ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రెండ్రోజుల క్రితం వంతెనపై సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా పోలీసులు తెలిపారు. వీరు శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జి చూసేందుకు వచ్చారు. 

తమ ద్విచక్ర వాహనాన్ని పక్కన నిలబెట్టి.. రోడ్డుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వీరిని సందర్శకులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు కోలుకుంటున్నారు. ప్రమాదానికి కారణమైన కారు బంజారాహిల్స్‌కు చెందిన వ్యక్తిదిగా భావిస్తున్నారు.

ప్రమాదం నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఇకపై కేబుల్ బ్రిడ్జిపై టూ వీలర్స్ నిలపొద్దని, అలా చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వంతెనపై ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని.. అలాగని బర్త్ డే అని కేక్ కట్ చేస్తామంటే కుదరదని పోలీసులు హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై కేక్ కటింగ్స్ నిషేధించామని తెలిపారు. 

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రత్యేకతలు :

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించింది. 754.38 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణం కారణంగా మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గుతుంది. అలాగే రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిల్లో మాత్రం ఇంత పెద్దది ప్రపంచంలో ఎక్కడా లేదని నిపుణులు తెలిపారు. 

అమెరికా, యూరప్, రష్యా, హాంకాంగ్ దేశాలకు చెందిన ఇంజనీరింగ్ సంస్థలు కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం దుర్గం చెరువులో ఎలాంటి పిల్లర్లు వేయలేదు. రెండు చివర్లలో రెండు పిల్లర్లు మాత్రమే నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జిని 2020 సెప్టెంబర్ 25న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లు జాతికి అంకితం చేశారు. శని, ఆదివారాల్లో వంతెనపై వాహనాలను పూర్తిగా నిషేధించారు. ఈ రోజులు కేవలం పాదచారులకు మాత్రమే అనుమతి వుంటుంది. 


Comments