ఈ ఏడాది సాధారణ వర్షపాతమే .. ఈ రాష్ట్రాల్లో మాత్రం



దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ తొలి వారంలోనే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఎండ వేడికి తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఉపశమనం కోసం కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్ వేవ్ అంచనాల మధ్య ‘‘ స్కైమెట్ వెదర్ ’’ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ రుతుపవనాలను అంచనా వేసింది. 

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో తగినంత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్, ఒడిశాలలో తగిన వర్షాలు కురవకపోవచ్చు. భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని స్కైమెట్ వెదర్ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలో సీజన్ ప్రారంభ భాగంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయబడింది. 

స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ మాట్లాడుతూ.. ఎల్ నినో వేగంగా లా నినాగా మారుతోందని ఆయన తెలిపారు. లా నినా ఏడాదిలో రుతుపవనాలు ప్రసరణ మరింత బలంగా వుంటుంది. అలాగే సూపర్ ఎల్ నినో నుంచి బలమైన లా నినాకు మారడం చారిత్రాత్మకంగా మంచి రుతుపవనాలను ఉత్పత్తి చేసిందని జతిన్ అన్నారు. ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లోని రెండవ అర్ధభాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలావుండగా..  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గోవాలో హీట్ వేవ్ పరిస్ధితులు చోటు చేసుకుంటాయని అంచనా వేసింది. గోవా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని అప్రమత్తంగా వుండాల్సిందిగా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడులోనూ వేడిగాలులు వీస్తున్నాయి. కరూర్, ధర్మపురిలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల మార్కును చేరుకుంది. 

మంగళవారం దేశంలోని తూర్పు సహా మరికొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్ధితులు నెలకొంటాయని ఐఎండీ పేర్కొంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ , తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 


Comments