కోడిగుడ్డు ఇంకా పొదుగుతూనే వుంది.. మంత్రి గుడివాడపై పవన్ సెటైర్లు

 



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లి పట్టణంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ఆయన సెటైర్లు వేశారు. 

అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తొస్తుందని.. కానీ ఇప్పుడు మాత్రం కోడిగుడ్డు పేరు వింటున్నామని పవన్ కామెంట్ చేశారు. కోడి గుడ్డు పెట్టిందని.. కానీ ఇంకా పొదుగుతూనే వుందంటూ గుడివాడపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనకాపల్లి జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు శాఖలకు ఒకే మంత్రిని, ఒక విప్‌ను ఇచ్చిందని.. కానీ ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేదని పవన్ ఎద్దేవా చేశారు. జగన్ ఒక సీఎం కాదు.. మద్యం వ్యాపారి, ఇసుక దోపిడీ దారని ఆయన ఘాటు విమర్శలు చేశారు. 

తాను కోరుకుంటే ఎప్పుడో పదవి వచ్చేదని.. కానీ తన ఒక్కడి ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా పదేళ్లుగా పార్టీని నడపడమంటే అంత సులభం కాదని ఆయన తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీటులో తొలుత జనసేన పోటీ చేయాల్సి వుందని.. కానీ కేంద్ర నాయకత్వం అభ్యర్ధన మేరకు ఈ సీటును వదులుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రావాలంటే తప్పులు జరగకూడదని.. అందుకు అన్ని శక్తులు ఏకం కావాలని.. ఇందుకోసమే 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నామని పవన్ వెల్లడించారు.

Comments