అన్నయ్య చిరంజీవి జోలికొస్తే ఊరుకునేది లేదు : సజ్జలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

 


వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన అన్నయ్య చిరంజీవి అజాత శత్రువని, ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్డీయే కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో వెన్నుదన్నుగా నిలిచే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగాడంటే అది చిరంజీవి పుణ్యమేనని పేర్కొన్నారు. మీ అందరికీ డబ్బులు ఎక్కువైపోయాయి, అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తి వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలిపితే ఆయనను కూడా తిట్టేశారని పవన్ గుర్తుచేశారు. వైసీపీ విధానాలు బాగున్నాయని చెప్పినంత వరకు చిరంజీవి కూడా మంచివాడేనని.. కానీ ఎప్పుడైతే ఆయన జనసేన పార్టీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చి, కూటమి అభ్యర్ధులకు మద్ధతు ఇవ్వండని విజ్ఞప్తి చేస్తే చెడ్డవారైపోయారా అని జనసేన చీఫ్ ప్రశ్నించారు. మేం సింహాలం, సింగిల్‌కు వస్తామంటున్నారని.. మీరు గుంటనక్కలంటూ పవన్ ఎద్దేవా చేశారు. 

తన సంగతి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియదని, కులాలను విడగొట్టి జగన్ బాగుపడలేరని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన జనసేన ఇవాళ బలమైన పార్టీగా నిలిచిందని.. జగన్ వంటి నియంతను ఎదుర్కొనాలంటే ఎంతో బలం, తెగువ కావాలన్నారు. ఎంతో శ్రమించి పెద్దలందరితో చర్చలు జరిపి కూటమిని తీసుకొచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కోసమే తాను చొరవ తీసుకున్నానని .. నదుల అనుసంధానం ద్వారా నీటికొరత లేకుండా చూస్తామన్నారు. 

యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారాప్రతిచేతికి పని అందిస్తామని పవన్ స్పష్టం చేశారు. జగన్‌లా తనపై 32 కేసులు లేవని, వలసలు , పస్తులు లేని రాష్ట్ర నిర్మాణపై కూటమి లక్ష్యమని.. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 


Comments