లోక్‌సభ ఎన్నికలు : కర్ణాటకలో వీఐపీ సెగ్మెంట్లు ఇవే .. అందరిచూపూ ఇటే ..?

 


లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దక్షిణాదిలోని కీలకమైన రాష్ట్రం కర్ణాటకపై అందరిచూపు పడింది. సౌత్‌లో బీజేపీ బలంగా వున్న రాష్ట్రం కావడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ రీసెంట్‌గా అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటి రిజల్ట్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని బీజేపీ కృతనిశ్చయంతో వుంది.

కాంగ్రెస్, బీజేపీలకు తోడు జేడీఎస్ కూడా కొన్ని చోట్ల గట్టిపోటీ ఇచ్చే అవకాశం వుండటంతో కర్ణాటకలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల నుంచి పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచారు. అగ్రశ్రేణి కార్డియాలజిస్ట్, మైసూరు రాజకుటుంబానికి చెందిన వారసుడు, మాజీ ముఖ్యమంత్రిని బీజేపీ.. మంత్రులు, కీలక నేతలను కాంగ్రెస్ బరిలో దించింది. ఆ నియోజకవర్గాలు.. పోటీ చేస్తున్న ప్రముఖులను ఒకసారి పరిశీలిస్తే :

బెంగళూరు రూరల్ : డాక్టర్ సిఎన్ మంజునాథ్ (బిజెపి) వర్సెస్ డి కె సురేష్ (కాంగ్రెస్)

రాజధాని బెంగళూరు పరిధిలోని బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్‌పై కార్డియాలజిస్ట్ , మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్ పోటీ చేస్తున్నారు. జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ మంజునాథ్.. బీజేపీ, జేడీఎస్‌ల మధ్య సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. దేవెగౌడ కుమార్తె అనసూయని వివాహం చేసుకున్న డాక్టర్ మంజునాథ్ .. దేవెగౌడ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 12వ వ్యక్తి. 



2023 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కంచుకోట రామనగర నుంచి నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎంపికయ్యారు. మంజునాథ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా బెంగళూరు రూరల్ నుంచి గెలుపొందవచ్చని.. వొక్కలిగ కోటను నిలబెట్టుకోవడంలో బీజేపీ మద్ధతు కూడా కీలకమని జేడీఎస్ భావిస్తోంది. 

మరోవైపు డీకే సురేష్ మూడు పర్యాయాలు బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. హెచ్‌డీ కుమారస్వామి రాజీనామా తర్వాత 2013లో ఉప ఎన్నికల్లో సురేష్ 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీకే సురేష్ అభ్యర్ధి అశ్వత్ నారాయణ గౌడపై 2 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో డీకే సురేష్‌కు 8.78 లక్షలకు పైగా ఓట్లతో పాటు 54 శాతం ఓట్లను గెలుచుకున్నారు.

బెంగళూరు సౌత్: తేజస్వి సూర్య (బీజేపీ) vs సౌమ్య రెడ్డి (కాంగ్రెస్)

2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కుల్లో ఒకరైన తేజస్వి సూర్యను బీజేపీ బరిలో దించింది. 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి 11.84 లక్షల ఓట్లతో సూర్య విజయం సాధించారు. ఎన్నికల బరిలో దిగడానికి ముందు 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ డిజిటల్ కమ్యూనికేషన్‌లకు తేజస్వి సూర్య నాయకత్వం వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. 



2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి ఆయన సహకరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర్ నియోజకవర్గం నుంచి కేవలం 16 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ నేత సౌమ్యారెడ్డి.. సూర్యను ఎదుర్కోనున్నారు. 2018లో జయనగర్ నుంచి ఎన్నికైన రెడ్డి కర్ణాటక ముజ్రాయ్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి. 

మైసూరు : యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (బీజేపీ) వర్సెస్ ఎం లక్ష్మణ (కాంగ్రెస్)

మే 28, 2015న వడియార్ రాజవంశానికి 27వ రాజుగా పట్టాభిషేకం జరుపుకున్న యదువీర్ కృష్ణదత్త వడియార్ ప్రస్తుత మైసూర్ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బరిలో నిలిచారు. యదువీర్ త్రిషికా కుమారి వడియార్‌ను వివాహం చేసుకున్నారు. 



ఆమె తండ్రి హర్షవర్ధన్ సింగ్ బీజేపీ రాజ్యసభ ఎంపీ. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఎకనామిక్స్ , ఇంగ్లీష్‌లో గ్రాడ్యుయేట్ అయిన యదువీర్‌ను. చివరి వడియార్ వంశస్తుడైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ భార్య ప్రమోదా దేవి వడియార్ దత్తత తీసుకున్నారు. అతను చివరి మహారాజు జయచామరాజేంద్ర వడియర్ పెద్దకుమార్తె యువరాణి గాయత్రీ దేవి మనవడు. 

మైసూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వొక్కలిగ నేత ఎం లక్ష్మణ్‌ని యదువీర్‌పై కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. ప్రస్తుతం కేపీసీసీ అధికార ప్రతినిధిగా వున్న లక్ష్మణ.. మైసూరు సమగ్ర అభివృద్ధి మేనిఫెస్టోను ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

షిమోగా : బీవై రాఘవేంద్ర (బీజేపీ) వర్సెస్ గీతా శివరాజ్ కుమార్ (కాంగ్రెస్) 

ప్రముఖ లింగాయత్ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రను బీజేపీ బరిలో దించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాజీ సీఎం ఎస్ బంగారప్పను రాఘవేంద్ర 52 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఐదేళ్ల తర్వాత 2014లో షిమోగా నుంచి యడియూరప్ప పోటీ చేశారు. తిరిగి 2018లో ఆయన తన నియోజకవర్గాన్ని వెనక్కి తీసుకున్నారు. షిమోగాలోని పీఈఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు మేనేజింగ్ ట్రస్టీగా కూడా వున్నారు. 



బీవై రాఘవేంద్రతో పోటీ చేసేందుకు కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ భార్య గీత శివరాజ్‌కుమార్‌ను హస్తం పార్టీ రంగంలోకి దించింది. గీతా శివరాజ్ కుమార్ మాజీ సీఎం బంగారప్ప కుమార్తె. ఆమె సోదరుడు మధు బంగారప్ప రాష్ట్ర మంత్రి కాగా.. మరో సోదరుడు కుమార్ బంగారప్ప బీజేపీ నేత.

మాండ్య : హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్) వర్సెస్ వెంకటరమణ గౌడ (కాంగ్రెస్)

జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి మాండ్య సెగ్మెంట్‌ను కైవసం చేసుకునే క్రమంలో వొక్కలిగ సామాజికవర్గం మద్ధతును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా తటస్థంగా వున్న వారితో పాటు స్థానికంగా వున్న వొక్కలిక నేతల విశ్వాసాన్ని పొందేందుకు కుమారస్వామి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వొక్కలిగ వర్గానికి చెందిన వెంకట రమణ గౌడ్‌ను బరిలోకి దించడంతో ఇక్కడ పోటీ హోరాహోరీగా జరగనుంది. 

కాంగ్రెస్ అభ్యర్ధి కొన్ని నెలలుగా ప్రచారం నిర్వహిస్తూ వుండటంతో ఆయనకు వొక్కలిగ సామాజికవర్గం మద్ధతు వున్నట్లుగా తెలుస్తోంది. కుమారస్వామి ఇటీవల ఆదిమంచనగిరి మఠాన్ని సందర్శించారు. ఇది ప్రభావవంతమైన వొక్కలిగ సంస్థ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్ ఛరిష్మా కారణంగా ఈ సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్ వెంట నడిచింది. 



మాండ్య లోక్‌సభ స్థానం పరిధిలోని 8 సెగ్మెంట్లలో కాంగ్రెస్ కంటే జేడీఎస్ వెనుకంజలో వుంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కావేరి సమస్యను కూడా ఉపయోగించుకోవచ్చు. సానుభూతిని సృష్టించేందుకు కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని కూడా ప్రస్తావించవచ్చు. ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ ఓట్లు తనకు వస్తాయని కుమారస్వామి భావిస్తున్నారు. 

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ట్రెండ్స్ :

ఇండియా టుడ్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం.. కర్ణాటకలోని 28 సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 24 స్థానాలను గెలుచుకునే అవకాశం వుందని అంచనా వేసింది. విపక్ష ఇండి కూటమి 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం వుందని పేర్కొంది. ఎన్డీయేకు 53 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 42 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే తెలిపింది. 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లింగాయత్‌లు, వొక్కలిగల్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాల్లో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రభావం వుంది. అయితే పాత మైసూర్ ప్రాంతాల్లో వొక్కలిగలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి వుండగా.. కళ్యాణ కర్ణాటకలో ఎక్కువ మంది వున్నారు. 


Comments