బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్‌కి ప్రమాదం .. 8 కార్లు ధ్వంసం

 


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన వాహనశ్రేణిలోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి. ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కాగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున కేసీఆర్ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. దీనిలో భాగంగా బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బుధవారం మిర్యాలగూడలో ప్రారంభమైన కేసీఆర్ యాత్ర మే 10న సిద్ధిపేటలో ముగియనుంది. 

కాగా.. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ మండిపడ్డారు. ఈ జిల్లాలో మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ఇక్కడి వారేనని.. కానీ దద్దమ్మల్లాగా నాగార్జున సాగర్‌ను కేంద్రానికి అప్పగించారని కేసీఆర్ దుయ్యబట్టారు. 1956 నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ మన శత్రువని, మనల్ని అన్ని రకాలుగా గోస పెట్టింది ఆ పార్టీయేనని చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయాయంటే ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. రైతు బీమా వుంటదో ఊడుతదో తెలియదని.. ప్రతి ఇంట్లో నళ్లా బిగించి నీరందించామని.. ఇవాళ మిషన్ భగీరథ నడపలేకపోతున్నారని రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. 


Comments