లోక్‌సభ ఎన్నికలు : ప్రసంగం మధ్యలో స్పృహతప్పి పడిపోయిన నితిన్ గడ్కరీ

 


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో వుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని యావత్మల్ - వాశిమ్ స్థానం నుంచి మహాయతి కూటమి తరపున ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మహిళా నేత రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్ధతుగా బుధవారం నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఓ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది , నేతలు, కార్యకర్తలు నితిన్ గడ్కరీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మంత్రిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం నితిన్ గడ్కరీ పరిస్ధితి నిలకడగానే వున్నట్లుగా తెలుస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాలతో ప్రస్తుతం గడ్కరీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. 

ఇదిలావుండగా.. మహారాష్ట్రలోని కీలకమైన నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి నితిన్ గడ్కరీ మరోసారి బరిలో దిగారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి నరేంద్ర మోడీ కేబినెట్‌లో కీలక మంత్రి పదవులు నిర్వర్తించారు గడ్కరీ. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని ఆయన పట్టుదలతో వున్నారు. 

నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా వికాస్ థాక్రే, బీఎస్పీ నుంచి యోగేష్ పటిరామ్ లాంజేవార్‌లు పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, తన క్లీన్ ఇమేజ్‌లు మూడోసారి గెలిపిస్తాయని నితిన్ గడ్కరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


Comments