loksabha elections 2024 : లోక్‌సభ ఎన్నికల బరిలో ఇందిర గాంధీ హంతకుడి కొడుకు
భారతదేశంలో మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు వివిధ పార్టీలు టికెట్లు కేటాయించాయి. అయితే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు. సరబ్‌జీత్ ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో 2004లో భటిండా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అలాగే 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో భటిండా, ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సరబ్‌జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. అదే ఎన్నికల్లో సరబ్‌జీత్ తాత సుచాసింగ్ కూడా భటిండా గెలుపొందారు. మరోవైపు.. ఫరీద్‌కోట్ స్థానం నుంచి బీజేపీ తరపున పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ.. ఆప్ నుంచి ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్‌ను బరిలోకి దించింది. శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లు ఇంకా అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది.
కాగా.. సిక్కుల పవిత్ర క్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై సైనిక చర్య ‘‘ఆపరేషన్ బ్లూస్టార్’’ తర్వాత 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనిని ఆమె అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు తుపాకులతో కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత సిక్కులపై దారుణాలు జరిగాయి.
Comments
Post a Comment