మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ : పవన్‌కి బాసటగా చిరు, జనసేనకు రూ.5 కోట్ల విరాళం
ఎన్నో అంచనాల మధ్య ఏర్పాటు చేసిన ‘‘ ప్రజారాజ్యం పార్టీ ’’ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి తనకు ఎంతో ఇష్టమైన, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినిమాల వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. కానీ పీఆర్‌పీ .. కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారు.
తాను ఎంతో అభిమానించి, ఆరాధించే అన్నయ్య చిరంజీవితో ఈ విషయంలో విభేదించారు పవన్. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తొలినాళ్లలోనే జనసేన పార్టీని స్థాపించిన ఆయన పోరాటాలు చేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో సమాయాభావం వల్ల పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు మద్ధతుగా నిలిచి.. కూటమి అధికారంలోకి రావడానికి సహకరించారు.
చిరంజీవి మాదిరిగానే పవన్ కూడా ఏదో ఒక పార్టీలో జనసేనను విలీనం చేస్తారంటూ ప్రచారం జరగ్గా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీని నడిపించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే తన లక్ష్యమంటూ మరోసారి టీడీపీ - బీజేపీలకు మద్ధతుగా నిలిచారు. లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అండగా నిలుస్తున్నారు.
కుటుంబం విషయానికి వస్తే.. పవన్ మరో సోదరుడు నాగబాబు ఎప్పుడూ తమ్ముడికి అండగానే వుంటారు. జనసేనలో ఏనాడో చేరిన ఆయన పార్టీ పటిష్టతకు తన వంతు సాయం చేస్తున్నారు. కార్యదర్శి హోదాలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
నాగబాబు సరే మరి చిరంజీవి సంగతి ఏంటీ అనే సందేహం అందరిలోనూ వుంది. ఆయన ఏనాడూ తమ్ముడికి అనుకూలమని గాని, వ్యతిరేకమని గానీ చెప్పలేదు. అప్పుడు పరిస్ధితులు వేరు.. కానీ అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
అలాంటప్పుడు తన అభిమానులకు పవన్ విషయంలో ఏలాంటి సూచనలు చేస్తారోనని ఉత్కంఠ నెలకొంది. మెగా అభిమానులతో పాటు కాపు సామాజికవర్గంలోనూ చిరంజీవి మాటనే వేదంలా ఫాలో అయ్యేవారు ఎంతోమంది వున్నారు. వీరందరికి చిరు ఒక్క మాట చెబితే చాలు .
ఈ క్రమంలో టోటల్‌గా మెగా క్యాంప్ సంబరాలు చేసుకునే ఘటన జరిగింది. ఎన్నికల్లో జనసేన విజయాన్ని ఆకాంక్షిస్తూ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం అందించారు. సోమవారం హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ‘విశ్వంభర’ షూటింగ్ లోకేషన్‌కు పవన్ కళ్యాణ్, నాగబాబులు వెళ్లి చిరుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కు మెగాస్టార్ రూ.5 కోట్ల చెక్ అందజేసి ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వివరాలను చిరంజీవి ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
" అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను." అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవితో పవన్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి… pic.twitter.com/dJeJNcPp4x
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2024
Comments
Post a Comment