జనసేనకి పోతిన మహేశ్ రాజీనామా.. త్వరలోనే ప్రజారాజ్యం-2 అవుతుందంటూ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా టీడీపీ-జనసేన-బీజేపీలు పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయా సీట్లపై ముందు నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుని నేతలు.. పొత్తులో తమ టికెట్ గల్లంతు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగా కొందరు నేతలు పార్టీని వీడటానికి కూడా వెనుకాడటం లేదు.. ఇంకొందరు పార్టీలు మారి టికెట్ దక్కించుకుంటున్నారు.
విజయవాడకు చెందిన జనసేన నేత పోతిన మహేశ్ పార్టీకి రాజీనామా చేశారు. తొలి నుంచి పవన్ వెంట నడుస్తున్న ఆయన.. పార్టీకి గట్టి గొంతుగా వున్నారు. ప్రత్యర్ధుల విమర్శలకు తనదైన శైలిలో సమాధానం చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సెగ్మెంట్ బీజేపీకి వెళ్లింది. సుజనా చౌదరి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలపై పోతిన మహేశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జనసేనకు గుడ్ బై చెప్పేశారు.
వెళ్తూ వెళ్తూ మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆవేశంతోనో, సీటు రాలేదనో తాను పార్టీకి రాజీనామా చేయలేదని పోతిన మహేశ్ పేర్కొన్నారు. నటించేవారు నాయకుడు కాలేరని.. పవన్‌ను నమ్మి అడుగులు వేశానని ఆయన తెలిపారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్ధం కాక పిచ్చెక్కిందని.. పవన్ నిజ స్వరూపం అంతా తెలుసుకోవాలని పోతిన మహేశ్ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, కేడర్‌పై పవన్ కళ్యాణ్ దృష్టి సారించలేదని.. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిష్యత్తు ఇవ్వగలరని ఆయన ప్రశ్నించారు.
సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారని.. గెలిచిన తర్వాత వాళ్లు మీ కోసం నిలబడతారా అని మహేశ్ పేర్కొన్నారు. మీ తల్లిని దూషించిన సుజనా చౌదరికి టికెట్ ఇప్పించారని.. ఆయన గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవుతారని ఆయన నిలదీశారు. వచ్చే 12 నెలల్లో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుందని.. జనసేన పార్టీ.. ప్రజారాజ్యం-2 అయి తీరుతుందని పోతిన మహేశ్ జోస్యం చెప్పారు.
మంగళగిరి, విజయవాడ పశ్చిమ టికెట్‌లను బీసీల నుంచి తీసుకుని కమ్మోళ్లకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. కాపులు జనసేనకు దూరమయ్యారని.. గెలిచే భీమవరాన్ని వదిలి పిఠాపురానికి ఎందుకు వెళ్లారని మహేశ్ ప్రశ్నించారు. జనసేన పార్టీ మొత్తం వాట్సాప్‌లోనే నడుస్తోందని ఆయన ఆరోపించారు.
ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ-2 అయ్యి తీరుతుంది..- పోతిన మహేష్#Chiranjeevi #PrajaRajyamParty #PothinaMahesh #AndhraPradeshElections2024 #AndhraPradesh #Vijayawada #TDPJanasenaBJP #JanasenaParty #PawanKalyan #NTVTelugu pic.twitter.com/5aXkJfmLcE
— NTV Telugu (@NtvTeluguLive) April 8, 2024
Comments
Post a Comment