ఈసారి జగన్ గెలవడం కష్టమే .. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు , రాహుల్‌ స్ట్రాటజీ కరెక్ట్ కాదంటూ చురకలు

 



ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని సీఎం జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. జగన్ ఒంటరిగా బరిలో దిగగా.. చంద్రబాబు మాత్రం జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం విషయంలో ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు జాతీయ స్థాయిలోనూ ఏపీ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మధ్య మధ్యలో పలు ఏజెన్సీలు సర్వేలు సైతం వెలువరిస్తున్నాయి. ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త .. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం కష్టమేనని పీకే వ్యాఖ్యానించారు. ఆయనను ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్‌తో పోల్చారు. గతంలో రాజుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పించి ఏం చేయలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. భఘేల్ మాదిరిగానే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులుగా నియోజకవర్గాలకు ప్రొవైడర్‌గానే జగన్ వుండిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. 

జాతీయ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని.. ఒడిషా, బెంగాల్‌లలోనూ ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కుతాయని పీకే అంచనా వేశారు. విపక్షాలకు బీజేపీని ఓడించేందుకు అవకాశాలున్నా.. కేవలం బద్ధకం, సరైన వ్యూహాం లేకపోడంతోనే అది కుదరడం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. విపక్షాల పోరాటం అంతా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వుందని అటువంటప్పుడు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. 

రాహుల్ గాంధీ అమేథీలో పోటీ చేయకపోవడంపైనా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. అక్కడి నుంచి పోటీ చేయకపోవడం వల్ల ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని పీకే పేర్కొన్నారు. హిందీ బెల్ట్‌లో గణనీయమైన ఉనికి వుంటే తప్పించి భారత్‌ను గెలవలేరన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో గెలవకుండా వయనాడ్ నుంచి గెలిస్తే ప్రయోజనం వుండదన్నారు. 


Comments