ఓడినా , గెలిచినా రాహుల్ గాంధీ రాజే.. పీసీసీ ఛాన్స్ అడుగుతూనే వుంటా : జగ్గారెడ్డి కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అభిమానం చాటుకున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా రాహుల్ గాంధీ రాజే. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన గురించి మా కంటే .. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే మహిళలను అడగాలని ఆయన చురకలంటించారు. ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని.. తాను కూడా రెండు సార్లు పార్టీలు మారానని, పదవుల కోసం కక్కుర్తిపడనని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు.. మాదిగలు అంటేనే కాంగ్రెస్ అని మీరా కుమార్, దామోదర రాజనర్సింహలకు అవకాశం కల్పించింది కాంగ్రెస్సేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నానని.. ఆయన అధికారం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కలేదని, వారిది త్యాగాల కుటుంబమని జగ్గారెడ్డి అన్నారు. రాజ్యాంగం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని.. కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
డబ్బు, బతుకు తెరువు కోసమే పీకే సర్వే సంస్థ ఏర్పాటు చేశారని .. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇక పీసీసీ చీఫ్ పదవిపై ఆయన మాట్లాడుతూ.. అవకాశం వచ్చిన ప్రతిసారి తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవిని అడుగుతానని చెప్పారు. ఈసారి ఎస్సీ , ఎస్టీ, బీసీలలో ఒకరికి పీసీసీ అవకాశం వస్తే ఓకేనని.. కానీ రెడ్లలో ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ లిస్ట్‌లో తాను కూడా వుంటానని జగ్గారెడ్డి తేల్చేశారు.
Comments
Post a Comment