జగన్.. దాడి సరే, ఆ గులకరాయి ఎక్కడ .. నీ డ్రామాల్ని జనం నమ్మరు : చంద్రబాబు


 

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి కృష్ణాజిల్లా పెడనలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గతంలో గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్ ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు రావడంతో జగన్ కొత్త నాటకానికి తెరదీశారని .. ఈ డ్రామాలను ప్రజలు నమ్మరని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?

గతంలో తనపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించిందని.. కానీ జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఏదేమైనా జగన్‌పై రాయి దాడిని తాము ఖండించామని.. కానీ తమపై ఇలాంటి ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. లాండ్, శాండ్, లిక్కర్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలని సీఎం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ కూటమి అజెండా అని.. ఇందుకోసమే కొనకళ్ల నారాయణ, వేదవ్యాస్ వంటి వారు సీట్లు త్యాగం చేశారని చంద్రబాబు ప్రశంసించారు. 

మా జెండాలు వేరైనా అజెండా ఒకటేనని.. విధ్వంసం, అహంకారంతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని .. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. బందరు పోర్టు, అమరావతి నిర్మాణం పూర్తయితే పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని.. తమ కల ఇదేనని ఆయన స్పష్టం చేశారు. 


Comments