జగన్‌పై దాడి ఘటన.. నా ప్రమేయం వుంటే ఉరేయండి : బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

 



కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాయతో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలకం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే సీఎంపై దాడి వెనుక టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ప్రమేయం వుందంటూ కొన్ని మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.  దీనిపై బోండా ఉమా స్పందించారు. 

తెలుగు వార్తాసంస్థ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బోండా ఉమా మాట్లాడుతూ.. ఎవరో ఆకతాయి రాయి విసిరితే తనపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని.. రాజకీయ స్వార్థం కోసం తనను టార్గెట్ చేస్తున్న వారికి జూన్ 4 తర్వాత గట్టి సమాధానం చెబుతానని బోండా ఉమా హెచ్చరించారు. అన్యాయం జరిగిందన్న బాధతో, కోపంతో ఓ కుర్రాడు చీకట్లో రాయి విసిరాడని.. దురదృష్టవశాత్తూ అది సీఎంకు తగిలిందని ఆయన పేర్కొన్నారు. 

Also Read : యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?

దాడి జరిగిన ఘటనాస్థలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వుండటంతో .. కొందరు తనను టార్గెట్ చేశారని బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తన పేరును ఎవరు తీసుకొచ్చారో, ఎవరు కేసు నమోదు చేశారో, ఎవరు విచారణ చేయిస్తున్నారో.. జూన్ 4 తర్వాత ఖచ్చితంగా కేసుల్లో ఇరుక్కుంటారని ఉమా హెచ్చరించారు.  కోడికత్తి డ్రామా మాదిరిగానే మరోసారి సానుభూతిని పొందాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

విజయవాడ సెంట్రల్‌లో గెలిచేది తానేనని.. ఓడిపోయే వెల్లంపల్లి తనపై కేసు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడని బోండా ఉమా ఆరోపించారు. సీఎం జగన్‌పై దాడి వెనుక తన పాత్ర వుంటే తాను దేనికైనా సిద్ధమని , ఉరేసినా బాధపడనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇరికించాలని గానీ, తన పార్టీని ఇబ్బంది పెట్టాలని గానీ చూస్తే వదిలిపెట్టేది లేదని బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. 


Comments