కోమటిరెడ్డికి సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి .. కానీ : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రైతు రుణమాఫీపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రపంచం తలకిందులైనా సరే ఆగస్ట్ 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవిని ఏనాడూ గర్వంగా భావించలేదని.. బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ఎన్నో ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్ గౌరవించింది లేదని.. మోడీని గద్దె దించేందుకు లెఫ్ట్ నేతలు కాంగ్రెస్‌తో కలిసి వచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మోడీకి మద్ధతిచ్చిందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ ఎంపీలు మద్ధతిచ్చారని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. మోడీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని.. విపక్షాలను బెదిరించేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ.. 30 లక్షల మంది యువతను మాత్రం పట్టించుకోలేదని సీఎం ఫైర్ అయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ క్వశ్చన్ పేపర్లను జిరాక్స్ సెంటర్లలో అమమి యువత జీవితాలతో ఆడుకున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రాలో పార్టీకి నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు.
ఇకపోతే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. తనతో పాటు సీఎం పదవికి ఆయన అర్హుడని, తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని.. కేసీఆర్ దొంగ దీక్ష చేశారని, తెలంగాణను సర్వనాశనం చేశాడని సీఎం మండిపడ్డారు. ప్రత్యేక పరిస్ధితుల్లోనే పార్టీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందని.. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల పాటు కేసీఆర్ మోడీతో కుమ్మక్కయ్యారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ చీఫ్ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
భువనగిరి…
— Revanth Reddy (@revanth_anumula) April 21, 2024
నిరంకుశం పై ఎక్కు పెట్టిన అంకుశం…
నియంతల పై గురి పెట్టిన పౌరుషం…
ఎన్నడు మరువలేని యోధుల కీర్తి…
ఎప్పుడూ నాకు స్ఫూర్తి.#Bhongir #BhongirParliament pic.twitter.com/EueIa5tiKn

Comments
Post a Comment