లోక్‌సభ ఎన్నికలు : బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా .. కోమటిరెడ్డి సవాల్
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కనీసం రెండు స్ధానాల్లో గెలిచినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బుధవారం నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు డిపాజిట్లు కూడా రావన్నారు. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకు వస్తారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి వుండదని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారరు. ఇక.. తనకు సీఎం అయ్యే అర్హతలు వున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
అంతకుముందు .. కోమటిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ముందుగా కల్వకుంట్ల కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచించాలంటూ చురకలంటించారు. తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారని.. కానీ తాను పిలిస్తే దాదాపు పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో రెండు లేదా మూడు స్థానాల్లో గెలుస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని.. మెదక్‌లో మూడో స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ పరంగా నల్గొండ జిల్లాకు కేసీఆర్ అన్యాయం చేశారని.. మరి ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ఇక్కడ బస్సు యాత్ర చేపడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మోకాళ్ల మీద యాత్ర చేసినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాదన్నారు. కేసీఆర్ తన ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
మత ఘర్షణలు చెలరేగేలా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం బాధాకరమని.. ఇటీవల జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఉత్తర భారతంలో బీజేపీ పరిస్ధితి బాలేదేని.. అందుకే దక్షిణాదిపై దృష్టి పెట్టారని ఆరోపించారు.
👉కేసిఆర్.. మేం అర్భకులం కాదు.. నీ మోసాలను, నీ కుట్రలను, నీ దొరతనాన్ని ప్రజాస్వామ్య అస్త్రంతో ఛేధించిన అర్జునులం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 24, 2024
@INCIndia @INCTelangana pic.twitter.com/iv7qvThG8e

Comments
Post a Comment