మరో వారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీని తక్షణం బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని, అలాగే సోమవారం ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డిపై గత కొంతకాలంగా విపక్ష పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
గౌతం సవాంగ్ తర్వాత ఏపీ డీజీపీగా నియమితులయ్యారు కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే డీజీ ర్యాంక్ కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను వైసీపీ ప్రభుత్వం పక్కనపెట్టిందని విమర్శలు వెల్లువెత్తాయి. రెండేళ్లుగా ఆయనను అదే హోదాలో కొనసాగించింది. 1992 ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన రాజేంద్రనాథ్ రెడ్డి అదనపు డీజీపీ ర్యాంక్ నుంచి డీజీపీకి పదోన్నతి పొందిన కొద్దిరోజులకే డీజీపీగా నియమించింది జగన్ ప్రభుత్వం.
రాజేంద్రనాథ్ రెడ్డి తొలుత 1994లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. తర్వాత విశాఖ, నెల్లూరు, సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమీషనర్‌గానూ రాజేంద్రనాథ్ రెడ్డి విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగానూ సేవలందించారు. వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు ఆయన స్వగ్రామం. రాజేంద్రనాథ్ రెడ్డి సోదరుడు వ్యాపారవేత్తగా, సోదరి టీచర్‌గా పనిచేస్తున్నారు. మైదుకూరు, అనంతపురంలోని కొడిగెనహళ్లీలో ప్రాథమిక విద్యాభ్యాసం, రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

Comments
Post a Comment