మూగబోయిన మైక్‌లు .. సెలైంట్‌గా వీధులు

 


లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టీతో ప్రచార గడువు ముగిసింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణలోని 17, ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీలోని సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేశారు. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. 

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తదితరులు ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు దాదాపు 90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. వైసీపీ తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, వైఎస్ షర్మిల తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. 

తెలంగాణ విషయానికి వస్తే.. సోమవారం 13 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవి కావడంతో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 చోట్ల మాత్రం యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బండి సంజయ్, అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 


Comments